Telangana: తెలంగాణలో బడి పిల్లలకు అల్పాహారం

  • బెల్లం, రాగి జావతో అల్పాహారం
  • వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
  • మధ్యాహ్న భోజనంలో వెజిటబుల్ బిర్యానీ
Telangana Govt plans to provide in breakfast

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై ఉదయం అల్పాహారం కూడా అందించాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉదయం స్కూలుకు వచ్చిన విద్యార్థులకు టిఫిన్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విద్యార్థులకు బెల్లం, రాగి జావ కలిపిన టిఫిన్ ను అందజేయనున్నట్లు పేర్కొంది.

చాలామంది విద్యార్థులు ఉదయంపూట ఖాళీ కడుపుతో స్కూలుకు వస్తున్నారని, ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడకుండా ఉదయం పూట టిఫిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బలవర్థకమైన రాగిజావను అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇందుకు అవసరమైన బెల్లం పౌడర్, రాగి పిండిని స్కూళ్లకు పంపిస్తామని, మధ్యాహ్న భోజన పథకం కుక్ కమ్ హెల్పర్ వీటితో రాగి జావ తయారుచేస్తారని అధికారులు తెలిపారు. మధ్యాహ్న భోజనం మెనూలో వారంలో ఒకరోజు వెజిటబుల్ బిర్యానీని చేర్చినట్లు వివరించారు. మరోవైపు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలను చేర్చే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

More Telugu News