Fire Accident: మంటలు ఆర్పుతుంటే గుట్టలుగా బయటపడ్డ నోట్లకట్టలు.. సికింద్రాబాద్ లో ఘటన!

  • రెజిమెంటల్ బజార్ లోని ఓ ఇంట్లో రూ.కోటికిపైగా సొమ్ము స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • పెద్దమొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు సీజ్
  • ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో లేని యజమాని
Fire accident in secunderabad

సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్ లో శనివారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి బెడ్ రూంలో భారీగా నోట్లకట్టలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని నోట్లకట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఆదాయపన్ను అధికారులకు సమాచారం అందించారు. రెజిమెంటల్ బజార్‌లోని ఓ చిన్న ఇంట్లో పెద్ద మొత్తంలో నోట్లకట్టలు బయటపడడం సంచలనం సృష్టించింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. సదరు ఇంటి యజమాని శ్రీనివాస్ ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నారు. అదే కంపెనీకి చెందిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన హైదరాబాద్ లో లేరని పోలీసులు చెప్పారు. కాగా, స్వల్ప అగ్నిప్రమాదం కావడంతో వెంటనే మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇంతలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెడ్ రూంలో దాచిన సొమ్ము భద్రంగా ఉందా లేదా అని తనిఖీ చేయడం చూశామని, పెద్ద మొత్తంలో క్యాష్ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించామని వివరించారు. శ్రీనివాస్ ఇంట్లో మొత్తం రూ.1.64 కోట్ల నగదు, పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. శ్రీనివాస్ ఇంట్లో దొరికిన నగదు హవాలా సొమ్ముగా అధికారులు భావిస్తున్నారు.

More Telugu News