BJP: ఆయుధాలు లేని కొత్త తరహా ఉగ్రవాదాన్ని ‘ది కేరళ స్టోరీ’ బట్టబయలు చేసింది: జేపీ నడ్డా

BJP chief Nadda watches The Kerala Story with students says film exposes new type of terrorism
  • ఇలాంటి ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమాని వ్యాఖ్య
  • బెంగళూరులో యువతతో కలిసి సినిమా చూసిన బీజేపీ అధ్యక్షుడు
  • ఐనాక్స్ లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసిన కర్ణాటక బీజేపీ నేతలు
సినీ, రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. లవ్ జిహాద్ పేరిట కేరళకు చెందిన 32 వేల మంది యువతులను ట్రాప్ చేసి ఐసిస్ లో చేర్చారని పేర్కొంటూ తీసిన చిత్రాన్ని కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కేరళలో జరిగిన అసలు నిజాన్ని చూపించారంటూ ప్రధాని మోదీ సహా పలువురు బీజేపీ నేతలు దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ చిత్రాన్ని వీక్షించారు. తీవ్ర వ్యతిరేకత తర్వాత బీజేపీ రాష్ట్ర శాఖ బెంగళూరులోని ఐనాక్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక షోను ఎంపీ తేజస్వి సూర్య, పలువురు యువతతో కలిసి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయుధాలు ఉపయోగించని కొత్త తరహా ఉగ్రవాదాన్ని ఈ చిత్రం బట్టబయలు చేసిందని అన్నారు.  

‘మనం తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితో కూడిన ఉగ్రవాదం గురించి విన్నాం. కానీ, ఆయుధాలు లేకుండా చేసిన ఉగ్రవాదం గురించి ఈ సినిమా కళ్లకు కట్టింది. ఇది ప్రమాదకరమైన ఉగ్రవాదం. ఈ రకమైన ఉగ్రవాదం ఒక రాష్ట్రానికి, ఒక మతానికి సంబంధం లేదు. యువతలను ఎలా ప్రభావితం చేస్తున్నారో, తప్పుడు మార్గాలను అనుసరించేలా ఎలా చేస్తున్నారో ఈ చిత్రం చూపించింది. అటువంటి విషపూరిత ఉగ్రవాదాన్ని, దాని వెనుక ఉన్న కుట్రను ఈ సినిమా విజయవంతంగా బహిర్గతం చేసింది. మన యువత తప్పుదారి పట్టి, తిరిగి రాని స్థితికి చేరుకున్నారు. ఈ చిత్రం అలాంటి వారి కళ్లు తెరిపించింది. వారంతా దీన్ని చూడాలి’ అని పేర్కొన్నారు.
BJP
JP Nadda
The Kerala Story
Karnataka
terrorism

More Telugu News