NTR: ఆ సినిమా షూటింగులో ఎన్టీఆర్ ఎలా ఉండేవారంటే..: షావుకారు జానకి

Shavukaru Janaki Interview
  • 'షావుకారు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జానకి 
  • ఎన్టీఆర్ తేజస్సును అలా చూస్తుండిపోయానని వెల్లడి 
  • ఆయన సాధించిన విజయాలు మరొకరికి సాధ్యం కావని వ్యాఖ్య 
  • ఆయన పొందిన ప్రేమాభిమానాలు అసాధారణమని వివరణ
తెలుగు సినిమా చరిత్రలో 'షావుకారు' సినిమా స్థానం ప్రత్యేకం. ఆ సినిమాతోనే పరిచయమైన జానకి, ఆ తరువాత 'షావుకారు' జానకిగా పాప్యులర్ అయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో తాజాగా ఆమె 'తెలుగు వన్ 'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ .. "నేను 'షావుకారు' సినిమా  చేసేనాటికి, ఎన్టీఆర్ గారు కూడా ఇండస్ట్రీకి కొత్తనే. నేను ఒక బిడ్డకు తల్లిని అయిన తరువాత సినిమాల్లోకి వచ్చాను .. ఆయన కూడా పెళ్లి అయిన తరువాతనే సినిమాల్లోకి వచ్చారు' అన్నారు.

ఈ సినిమాకి ముందు నేను ఎన్టీఆర్ గారిని చూడలేదు. షూటింగు సమయంలో ఆయనను చూశాను. ఆ తేజస్సు .. ఆ అందం అలా చూస్తుండిపోయాను. సెట్లో అందరి పరిస్థితి అదే. సెట్లో ఆయన .. నేను అస్సలు మాట్లాడుకునేవారం కాదు. ఈ సినిమాలో ఆయన చాలా నేచురల్ గా చేశారు .. ఈ సినిమా తరువాత నుంచి ఇక ఆయన వెనుదిరిగి చూడలేదు. ఒక్కో సినిమాను చేస్తూ హిమాలయాల ఎత్తుకు ఎదిగిపోయారు" అని అన్నారు. 

" ఎన్టీఆర్ గారిని చూస్తే తన జాతకం తనే రాసుకున్నారా అనిపించేది. అందుకు కారణాలు ఆయన సాధించిన విజయాలు .. చేరుకున్న లక్ష్యాలు అనే చెప్పుకోవాలి. ప్రజలపై ఆయన చూపిన ప్రభావం ... వారి నుంచి ఆయన పొందిన ప్రేమ చూస్తే, ఇది మరొకరికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఆయన ఒక స్థాయికి వెళ్లిన తరువాత నాకు గురుభావమే కలిగేది" అని చెప్పుకొచ్చారు. 

NTR
Shavukaru Janaki
Shavukaru Movie

More Telugu News