Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ చిన్నారులు భవేశ్ రెడ్డి, కార్తికేయ రెడ్డి మరిన్ని విజయాలు అందుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan appreciates Bhavesh Reddy and Kartikeya Reddy
  • తైక్వాండోలో సత్తా చాటున్న పడాల సోదరులు
  • యూరప్ దేశాల్లో నిర్వహించే టోర్నీల్లో పలు పతకాలు
  • పవన్ కల్యాణ్ దృష్టిలో పడిన వైనం
  • సోదరులిద్దరినీ, వారి తల్లిదండ్రులను అభినందించిన జనసేనాని 
చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటుతున్న భవేశ్ రెడ్డి, కార్తికేయ రెడ్డి అనే సోదరులు జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టిని ఆకర్షించారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ యోధుడైన పవన్ కల్యాణ్... ఈ చిన్నారుల ఘనతలను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. 

ఓ ప్రకటనలో వారిద్దరి గురించి వివరించారు. తైక్వాండోలో శిక్షణ పొందుతూ యూరప్ దేశాల్లో పతకాలు సాధిస్తున్న మన తెలుగు చిన్నారులు పడాల భవేశ్ రెడ్డి, పడాల కార్తికేయ రెడ్డి గురించి తెలుసుకుని ఎంతో సంతోషించానని పవన్ వెల్లడించారు. 

"అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన పడాల సూర్యచంద్రారెడ్డి ఉద్యోగరీత్యా డెన్మార్క్ దేశంలో ఉంటున్నారు. తన కుమారుడు భవేశ్, కార్తికేయలకు తైక్వాండోలో శిక్షణ ఇప్పిస్తున్నారు. పదేళ్ల వయసున్న భవేశ్, ఏడేళ్ల కార్తికేయ డెన్మార్క్, బెల్జియం, జర్మనీల్లో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించడం అభినందనీయం. ఈ సోదరులు భవిష్యత్తులో మరింతగా రాణించి ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. 

తైక్వాండోలో విశేషంగా రాణిస్తున్న ఆ చిన్నారులు మన దేశం వచ్చినప్పుడు వారిని కలిసి ముచ్చటిస్తాను. తమ చిన్నారులను తైక్వాండోలో మరింత ఉన్నత శిక్షణ కోసం ఇతర దేశాల్లో నిర్వహించే శిబిరాలకు పంపిస్తున్న సూర్యచంద్రారెడ్డి దంపతులకు అభినందనలు" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Pawan Kalyan
Bhavesh Reddy
Kartikeya Reddy
Taekwondo
Europe
Dr BR Ambedkar Konaseema District
Andhra Pradesh

More Telugu News