Philip Salt: తొలుత కలబడ్డారు.. ఆపై హగ్ ఇచ్చుకున్నారు.. ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్‌లో అరుదైన ఘటన.. వీడియో ఇదిగో!

  • సిరాజ్ బౌలింగులో వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టిన సాల్ట్
  • ఆ తర్వాతి బంతిని వైడ్ వేయడంతో ఏదో అన్న ఢిల్లీ బ్యాటర్
  • వేలు చూపిస్తూ నోరు మూసుకోవాలన్న సిరాజ్
  • అంపైర్ జోక్యంతో సద్దు మణిగిన వివాదం
Phil Salt Mohammed Siraj Hug Each Other after heated exchange DC vs RCB

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ అరుదైన దృశ్యానికి వేదికైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది.

మహమ్మద్ సిరాజ్ వేసిన ఐదో ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన ఫిల్ సాల్ట్.. మూడో బంతిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత సంధించిన బంతి వైడ్ అయింది. దీంతో సిరాజ్ వైపు చూసి నవ్వుతూ సాల్ట్ ఏదో అన్నాడు. ఇది సిరాజ్.. సాల్ట్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వార్నర్ కల్పించుకోవడంతో సిరాజ్ వేలు చూపిస్తూ అతడి పైపైకి వెళ్లాడు. అక్కడితో ఆగక, నోటిపై వేలు ఉంచి నోరు మూసుకోమని చెప్పడంతో గొడవ పెద్దదైంది. ఈ లోగా అక్కడికి చేరుకున్న అంపైర్ సిరాజ్‌ను అక్కడి నుంచి పంపేయడంతో గొడవ సద్దుమణిగింది.  

 ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్న సమయంలో సిరాజ్-సాల్ట్ ఇద్దరూ హగ్ చేసుకుంటూ కనిపించారు. విజయం సాధించినందుకు ఫిలిప్‌ను సిరాజ్ అభినందించాడు. సాల్ట్ 45 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

More Telugu News