Virat Kohli: బీసీసీఐ అధికారులకు వివరణ ఇచ్చుకున్న కోహ్లీ.. జరిమానాపై అసంతృప్తి

  • నూరు శాతం మ్యాచ్ ఫీజు విధింపు పట్ల నొచ్చుకున్న కోహ్లీ
  • నాటి సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేసిన ఆర్సీబీ ఆటగాడు
  • తన తప్పేమీ లేదని బీసీసీఐ అధికారులకు స్పష్టీకరణ
Virat Kohli writes to BCCI officials after ugly fights with Gambhir and Naveen says didnt say anything wrong Report

ఇటీవల టీమిండియా క్రికెటర్, ఆర్సీబీ జట్టు సభ్యుడు విరాట్ కోహ్లీ.. లక్నో జట్టు ఆటగాళ్లు, మెంటార్ గౌతమ్ గంభీర్ ల మధ్య మైదానంలో వాడీవేడీ వాగ్వాదం జరిగిన విషయం విదితమే. ఈ విషయంలో బీసీసీఐ అధికారులతో కోహ్లీ తన గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. జరిగిన అంశంపై వివరాలు ఇవ్వడంతో పాటు, ఈ అంశంలో బీసీసీఐ తనపై తీసుకున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు దైనిక్ జాగరణ్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. 

లక్నో ఏక్నా స్టేడియంలో ఈ నెల 1న ఆర్సీబీ, లక్నో జట్లు తలపడడం తెలిసిందే. ఈ మ్యాచ్ లో బెంగళూరు విజయాన్ని సాధించింది. వికెట్ పడిన ప్రతిసారి విరాట్ కోహ్లీ తెగ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ చివర్లో లక్నో పేసర్ నవీనుల్ హక్, మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో జట్టు మెంటార్ గంభీర్ తో కోహ్లీ వివాదం కొని తెచ్చుకోవడం తెలిసిందే. నవీనుల్ హక్ కు కోహ్లీ తన షూ అడుగు భాగం చూపించి, ఏదో దూషిస్తున్నట్టు వీడియో క్లిప్ లు సైతం బయటకు వచ్చాయి. ఈ పరిణామాలను బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. దీంతో మ్యాచ్ తర్వాత కోహ్లీ, గంభీర్ లకు మ్యాచు ఫీజుల్లో నూరు శాతం జరిమానా కింద విధించింది. నవీనుల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టింది. 

దీంతో విరాట్ కోహ్లీ బీసీసీఐ ఉన్నతాధికారులు కొందరికి విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేసినట్టు సమాచారం. అది లేఖ రాశాడా, పోన్ ద్వారా టెక్ట్స్ రూపంలో వెల్లడించాడా అనేది తెలియరాలేదు. నాటి సందర్భాన్ని అతడు వివరించే ప్రయత్నం చేశాడు. నవీనుల్ హక్ లేదా గంభీర్ తో తానేమీ అనలేదని, అంత భారీ జరిమానా విధించడం సరికాదని పేర్కొన్నట్టు కథనంలో ఉంది. నూరు శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో కోహ్లీ సుమారు రూ.1-1.25 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అయితే, అతడి తరఫున ఆర్సీబీయే ఈ భారాన్ని మోయనుంది.

మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ప్రవర్తించిన తీరుపై లక్నో జట్టు సభ్యుడు అమిత్ మిశ్రా సైతం అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. ఆర్సీబీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌన్సర్లు, త్రో బాల్స్ ను వేయడమే, నవీనుల్ హక్ లో అసహనానికి దారితీసినట్టు తెలుస్తోంది. అయితే, తాను కేవలం బౌన్సర్లు మాత్రమే సంధించాలని సిరాజ్ కు చెప్పినట్టు కోహ్లీ ఆ తర్వాత స్పష్టత ఇవ్వడం గమనార్హం. కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వబోగా నవీనుల్ హక్ దూకుడుగా దాన్ని స్వీకరించక, నెట్టివేయడం కూడా చర్చనీయాంశం అయింది. దీంతో నవీనుల్ హక్ పై కోహ్లీ బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

More Telugu News