Narendra Modi: 'ది కేరళ స్టోరీ' సినిమాపై కర్ణాటకలో ప్రధాని మోదీ ఏమన్నారంటే..!

  • సమాజంపై తీవ్రవాద ప్రభావాన్ని బహిర్గతం చేసే ప్రయత్నమే ఈ సినిమా అని వ్యాఖ్య
  • తీవ్రవాద మూకలకు కాంగ్రెస్ మద్దతివ్వాలనే ప్రయత్నమని మండిపాటు
  • జై బజరంగ్ భళి అని నేను నినదించినా ఆ పార్టీకి ఇబ్బందికరమే అన్న ప్రధాని
PM Modi accuses Congress over The Kerala Story Controversy

'ది కేరళ స్టోరీ' సినిమాపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారిలో ప్రధాని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఈ చిత్రాన్ని వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ తీవ్రవాద మూకలకు మద్దతిచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 

'ది కేరళ స్టోరీ' చిత్రం సమాజంపై తీవ్రవాదం యొక్క ప్రభావాన్ని బహిర్గతం చేయడానికి ప్రయత్నించిన సినిమా అన్నారు. ముఖ్యంగా కష్టపడి పని చేసే, ప్రతిభావంతుల భూమి అయిన కేరళ వంటి రాష్ట్రంలో... కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ సినిమాను బ్యాన్ చేయడం ద్వారా టెర్రర్ ఎలిమెంట్స్ కు మద్దతివ్వాలని ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ కు బ్యాన్ చేయడం, అభివృద్ధిని విస్మరించడం మాత్రమే తెలుసునని చెప్పారు. తాను 'జై బజరంగ్ భళి' అని నినాదాలు చేయడం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్నారు.

సమాజంలో కొత్త తరహా ఉగ్రవాదాన్ని బట్టబయలు చేసేందుకు ఈ సినిమా ప్రయత్నించిందన్నారు. ఉగ్రవాదం ఇప్పుడు కొత్త రూపం దాల్చిందని, ఆయుధాలు, బాంబులు వాడడమే కాకుండా సమాజం లోనికి చొచ్చుకు వచ్చి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు.'ది కేరళ స్టోరీ' సినిమా ఈ ఉగ్రవాద కొత్త ముఖాన్ని బట్టబయలు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాద సంస్థల ముందు మోకరిల్లిందని, హింసాకాండ కారణంగా చాలా కాలంగా బాధపడ్డామని, కాంగ్రెస్ ఈ దేశాన్ని ఉగ్రవాదం నుంచి ఏనాడూ రక్షించలేదన్నారు. కర్ణాటకను కాంగ్రెస్ కాపాడగలదా? అని ప్రశ్నించారు.

More Telugu News