R5 Zone: అమరావతి ఆర్5 జోన్ పై రైతుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

  • రాష్ట్రంలో ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాలు
  • ఆర్5 పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసిన సర్కారు
  • అందుకోసం జీవో 45 జారీ
  • జీవోను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్
AP High Court dismiss Amaravati farmers petition on R5 zone

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఏపీ సర్కారు ఆర్5 పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆర్5 జోన్ కోసం గుంటూరు జిల్లా నుంచి 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 583.93 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీయే కమిషనర్ కు అనుమతిస్తూ జీవో నెం.45ను ప్రభుత్వం తీసుకువచ్చింది. 

ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెం.45ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అమరావతి భూములను సీఆర్డీఏ ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని కోరారు. 

అయితే, రైతులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. రైతుల పిటిషన్ ను తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. 

హైకోర్టు తీర్పు నేపథ్యంలో, అమరావతి రైతులు రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

More Telugu News