Jagan: భోగాపురం ఎయిర్ పోర్టును 2026లో నేనే ప్రారంభిస్తా: వైఎస్ జగన్

ys jagan foundation stone for bhogapuram airport and key comments on northern andhra development
  • విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన
  • ఉత్తరాంధ్రకు మూలపేట పోర్టు మణిహారం.. భోగాపురం కిరీటం కాబోతున్నాయని వ్యాఖ్య
  • చంద్రబాబు హయాంలో ఎయిర్ పోర్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న
  • ఎన్నికలకు ముందు వచ్చి టెంకాయ కొట్టి వెళ్లారని ఎద్దేవా
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ‘‘మూడేళ్లలో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తవుతుంది. మళ్లీ 2026లో మీ బిడ్డ జగన్ ఇక్కడికి వచ్చి ఎయిర్ పోర్టును ప్రారంభిస్తాడు’’ అని ధీమా వ్యక్తం చేశారు. భోగాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. 

విప్లవాల గడ్డ అయిన ఉత్తరాంధ్ర.. ఇక మీదట అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని సీఎం అన్నారు. ‘‘శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. 24 నెలల్లో మూలపేట పోర్టు పూర్తవుతుంది. ఓడలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్రకు మూలపేట పోర్టు మణిహారం అవుతుంది. భోగాపురం కిరీటం కాబోతోంది’’ అని చెప్పుకొచ్చారు. స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికే వస్తారని జగన్ చెప్పారు. 

ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరెన్ని కుట్రలు పన్నినా తనను ఏమీ చేయలేరని జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్జీటీల్లో కేసులు పరిష్కరించుకుని ఇవాళ శంకుస్థాపన చేశామన్నారు. ‘‘గతంలో చంద్రబాబు ఎన్నికలకు కేవలం రెండు, మూడు నెలల ముందు వచ్చి టెంకాయ కొట్టి వెళ్లారు. ‘గతంలోనే మేం శంకుస్థాపన చేశాం’ అని వాళ్లు మళ్లీ చెప్పుకోవడం దారుణం’’ అని విమర్శించారు. 

‘‘2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు రెండు రన్ వేలతో ప్రారంభం అవుతుంది. దాదాపు ఐదు వేల కోట్లతో, రెండు ఏరో బ్రిడ్జ్ లు, కార్గో యూనిట్లు, ఏవియేషన్ అకాడమీ వంటి సదుపాయాలతో ఈ ఎయిర్ పోర్టు ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ 60 లక్షల జనాభాకు తొలిదశలో అందుబాటులోకి వస్తుంది’’ అని జగన్ వివరించారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ‘ఏ 380 డబుల్ డెక్కర్’ కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్ పోర్టులో రెండు రన్ వేలు నిర్మిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఎయిర్ పోర్టు పక్కనే మరో 500 ఎకరాల్లో ఏరో సిటీ కూడా రాబోతోందన్నారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్న జీఎంఆర్ మల్లికార్జునరావును 36 నెలల్లో పూర్తవ్వాల్సిన ఈ ప్రాజెక్టు అంతకంటే ముందే చేస్తారా అని అడిగితే ఆయన 30 నెలల్లో పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. 

ఎయిర్ పోర్టుకు అనుమతించిన ప్రధాని, కేంద్రమంత్రులకు, భూములిచ్చిన రైతులకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఉత్తరాంధ్ర అంటే బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జన్మించిన పౌరుషాల గడ్డ. ఆ విప్లవ వీరుడిని మర్చిపోలేదు. అందుకే ఉత్తరాంధ్రలో కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాం. మూడు జిల్లాల ఉత్తరాంధ్రకు ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు ఎస్పీలు సరిపోరని ఆరు జిల్లాలు చేశాం’’ అని వివరించారు.
Jagan
bhogapuram airport
northern andhra
foundation stone
mulapeta port
TDP
Chandrababu

More Telugu News