మామిడి గుజ్జుతో హ్యాండ్ బ్యాగ్ తయారీ.. సీఎల్ఆర్ఐ ఆవిష్కరణ
- తోలు మాదిరి మెటీరియల్ ను తయారు చేసిన సీఎల్ఆర్ఐ
- దీనిపై పేటెంట్ కు దరఖాస్తు
- ముంబైలోని ప్రైవేటు కంపెనీకి టెక్నాలజీ బదిలీ
సింథటిక్ తోలుకు ఇది పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం అవుతుందని భావిస్తున్నారు. నూతనంగా రూపొందించిన మెటీరియల్ లో 50 శాతం మామిడి గుజ్జు ఉంటుంది. కాకపోతే పాలీయురేథేన్ తో తయారు చేసిన తోలు కంటే మామిడితో చేసిన తోలు జీవిత కాలం తక్కువ. సీఎల్ఆర్ఐ శాస్త్రవేత్తలు దీనిపై పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ టెక్నాలజీని ముంబైకి చెందిన స్టార్టప్ ఆమతి గ్రీన్ ప్రైవేటు లిమిటెడ్ కు బదిలీ చేశారు. సీఎల్ఆర్ఐ మామిడి తోలు పరిశోధనకు నిధులను సమకూర్చింది ఆమతి గ్రీన్ కావడం గమనార్హం.
మామిడి గుజ్జుని బయోపాలిమర్ తో కలిపి, ఆ తర్వాత పౌడర్ గా మార్చి షీట్ గా తయారు చేస్తారు. సర్ఫేస్ కోటింగ్ అనంతరం ఆ మెటీరియల్ తో బ్యాగులు, ల్యాప్ టాప్ కవర్లను తయారు చేస్తారు. వీటి మన్నికపై పరీక్షలు నిర్వహించారు. పాదరక్షలు సైతం తయారు చేసేందుకు వీలుగా ఈ మెటీరియల్ ను మరింత మెరుగుపరచడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. అయితే సహజ తోలుతో మరే మెటీరియల్ పోటీ పడలేదని వీరు ప్రకటించారు. మన దేశంలో మామిడి ఎక్కువగా సాగు అవుతుండడంతో దీన్ని పరిశోధనకు ఎంచుకున్నారు. మామిడి సాయంతో తోలు తయారు చేస్తున్న ఏకైక కంపెనీ ప్రస్తుతం నెదర్లాండ్ లోనే ఉంది.