banks: రైటాఫ్ రుణాల రికవరీ 40 శాతానికి పెంచాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు

  • అయిదేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.7.34 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి
  • ఇందులో రూ.1.03 లక్షల కోట్లు మాత్రమే రికవరీ
  • 2022 మార్చి నాటికి నికర రైటాఫ్ రుణ మొత్తం రూ.6.31 లక్షల కోట్లు
PSU banks to enhance recovery rate from written off accounts to about 40 pc

రైటాఫ్ (రద్దు) చేసిన రుణాలను రికవరీ చేసే విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించింది. రికవరీ రేటును 40 శాతానికి పెంచాలని కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారి చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇది పదిహేను శాతం కంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకు అంతకుముందు అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.7.34 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేయగా, ఇందులో 14 శాతం మాత్రమే రికవరీ చేశాయి. అంటే రూ.1.03 లక్షల కోట్లను రికవరీ చేశారు. మార్చి 2022 చివరి నాటికి నికర రైటాఫ్ రుణ మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది.

రైటాఫ్ చేసిన రుణాల విషయంలో బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నట్లుగా ఆర్థిక శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్కువస్థాయి రికవరీ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. అధిక రికవరీ జరిగితే బ్యాంకుల మూలధనం పెరుగుతుందని వెల్లడించింది. ఈ అంశంపై పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్థిక సేవల విభాగం త్వరలో ప్రభుత్వరంగ బ్యాంకుల సీనియర్ అధికారులతో సమావేశం కానుందని చెబుతున్నారు. వివిధ కోర్టులు, రుణ వసూళ్ల ట్రైబ్యునల్స్ వద్ద పెండింగులో ఉన్న కేసులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరం వరకు గత ఆరేళ్లలో బ్యాంకులు తమ బుక్స్ నుండి రూ.11.17 లక్షల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయి. ఆర్బీఐ డేటా ప్రకారం... గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రయివేటు రంగ బ్యాంకులు వరుసగా రూ.8,16,421 కోట్లు, రూ.3,01,462 కోట్ల మొత్తాన్ని రద్దు చేశాయి.

More Telugu News