Vijay Shankar: ఆడుతున్నది అప్పటి విజయ్ శంకర్ కాదు... గుజరాత్ ను ఈజీగా గెలిపించిన తమిళ తంబి!

Vijay Shankar squash buckling innings makes Gujarat Titans victorious
  • ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × గుజరాత్ టైటాన్స్
  • 7 వికెట్ల తేడాతో గెలిచిన టైటాన్స్
  • విజయ్ శంకర్ 24 బంతుల్లో 51 నాటౌట్
  • 2 ఫోర్లు, 5 సిక్సులు బాదిన విజయ్ శంకర్
  • ఈ సీజన్ లో తనదైన ముద్ర వేస్తున్న తమిళనాడు ఆల్ రౌండర్
ఐపీఎల్ లో ఒకప్పుడు విజయ్ శంకర్ అంటే ఓ సాధారణ ఆటగాడు మాత్రమే. బ్యాటింగ్ కు ఇలా రావడం, అలా పోవడం అన్నట్టుగా ఉండేది. ఈ తమిళనాడు క్రికెటర్ ఐపీఎల్ లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఆడాడు. 

అయితే ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్ శంకర్ ఇప్పుడు తన కొత్త వెర్షన్ 2.0ని ఘనంగా ప్రదర్శిస్తున్నాడు. ఆడుతున్నది ఒకప్పటి విజయ్ శంకరేనా అనిపించేలా చెలరేగిపోతున్నాడు. 150కి పైగా స్ట్రయిక్ రేట్ తో ఉతికారేస్తున్నాడు. 

ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించడంలోనూ విజయ్ శంకర్ దే కీలకపాత్ర. 180 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ మరో 13 బంతులు మిగిలుండగానే పని పూర్తిచేసింది. 

సెకండ్ డౌన్ లో వచ్చిన విజయ్ శంకర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 24 బంతుల్లో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ తమిళ తంబి స్కోరులో 2 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. డేవిడ్ మిల్లర్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 32 పరుగులు చేశాడు. 

అంతకుముందు, వృద్ధిమాన్ సాహా (10) స్వల్ప స్కోరుకే అవుటైనా, మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 35 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ కు శుభారంభం అందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 26 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా 1, ఆండ్రీ రస్సెల్ 1, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు. 

ఈ గెలుపు అనంతరం గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్ ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
Vijay Shankar
Gujarat Titans
KKR
Eden Gardens
IPL

More Telugu News