Andhra Pradesh: ఏపీ ఇంటర్ పరీక్షల్లో తప్పిన 9 మంది విద్యార్థుల బలవన్మరణం

  • రెండు రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాలు
  • మనస్తాపంతో ఆత్మహత్యలు
  • మార్కులు తక్కువ వచ్చాయని మరికొందరు
  • ఫెయిల్ అయ్యామన్న బాధతో ఇంకొందరు ఆత్మహత్య
9 Inter students committed suicide after fails in intermediate exams

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని కొందరు, మార్కులు తక్కువ వచ్చాయని మరికొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష (17) ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపంతో నిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సెలవుల కోసం కర్ణాటకలోని అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఆమె ఓ సబ్జెక్టులో తప్పిన విషయం తెలిసి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది.

అదే జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన బాబు (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గణితంలో తప్పడంతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఇంటర్ ఫస్టియర్‌లో మార్కులు తక్కువ వచ్చాయని ఆవేదన చెందిన అనకాపల్లికి చెందిన కరుబోతు తులసీ కిరణ్ (17) నిన్న ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పరీక్ష తప్పడంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) టెక్కలిలో నిన్న తెల్లవారుజామున రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

విశాఖపట్టణానికి చెందిన ఆత్మకూరు అఖిల శ్రీ (16), బోనెల జగదీశ్ (18), అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామానికి చెందిన మహేశ్ (17), ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన షేక్ జాన్ సైదా (16), అదే జిల్లా చిల్లకల్లుకు చెందిన రమణ రాఘవ ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు.

విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన ఓ విద్యార్థి,  రాజాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించారు. వీరిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More Telugu News