KKR: నాలుగు వరుస ఓటముల తర్వాత.. కోల్‌కతా ఖాతాలో విజయం

  • సమష్టిగా రాణించిన కేకేఆర్
  • బ్యాటింగ్‌లో ఇరగదీసిన జేసన్ రాయ్, కెప్టెన్ రాణ
  • బౌలింగులో మెరిసిన చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’
Kolkata Knight Riders Register Their Fourth Win After Consecutive 3 Defeats

మొత్తానికి కోల్‌కతా విజయం సాధించింది. నాలుగు వరుస ఓటముల తర్వాత బెంగళూరుపై భారీ విజయం అందుకుంది. తొలుత బ్యాటర్లు చెలరేగితే, ఆ తర్వాత బౌలర్లు విజృంభించడంతో బెంగళూరు బెంబేలెత్తింది. 201 పరుగుల లక్ష్య ఛేదనలో 179 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు అర్ధ సెంచరీతో మెరిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కోహ్లీ 37 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. మహిపాల్ లోమ్రోర్ 34, దినేశ్ కార్తీక్ 22 పరుగులు చేశారు. వీరు తప్ప జట్టులో మరెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కోల్‌కతా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు బోల్తా పడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసుకోగా, సుయాశ్ శర్మ, రసెల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. జేసన్ రాయ్, కెప్టెన్ నితీశ్ రాణా బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జేసన్ రాయ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, రాణా 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు.

జగదీశన్ 27, వెంకటేశ్ అయ్యర్ 31, రింకు సింగ్ 18, వీజ్ 12 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, విజయ్‌కుమార్ వైశాఖ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో పాలుపంచుకున్న వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జైపూర్‌లో మ్యాచ్ జరుగుతుంది.

More Telugu News