Punjab Kings: కొట్టుడే కొట్టుడు... ముంబయి బౌలర్లను చీల్చిచెండాడిన పంజాబ్ బ్యాటర్లు

  • వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి 
  • మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 214 రన్స్ చేసిన వైనం
  • విధ్వంసక బ్యాటింగ్ చేసిన కెప్టెన్ శామ్ కరన్, హర్ ప్రీత్, జితేశ్
Punjab Kings smashes Mumbai Indians bowling

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఓ దశలో పంజాబ్ స్కోరు 15 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు. ఈ స్కోరు చూసిన వారెవరైనా పంజాబ్ 200 మార్కు దాటుతుందంటే నమ్మలేరు. కానీ, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను ఉతకడంతో మొదలైన పంజాబ్ పవర్ హిట్టింగ్ చివరి ఓవర్ వరకు కొనసాగింది. ఆఖరి 5 ఓవర్లలో పంజాబ్ 96 పరుగులు సాధించిందంటే కొట్టుడు ఏ రీతిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

హర్ ప్రీత్ భాటియా, కెప్టెన్ శామ్ కరన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ తమ బ్యాట్లకు పనిచెప్పడంతో స్టేడియంలో పరుగుల సునామీ వచ్చింది. హర్ ప్రీత్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేయగా.... శామ్ కరన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 55 పరుగులు సాధించాడు. జితేశ్ మాత్రం కేవలం సిక్సులే కొడతా అన్నట్టు చెలరేగిపోయాడు. జితేశ్ 7 బంతుల్లో 4 సిక్సులు బాది 25 పరుగులు నమోదు చేశాడు. 

అంతకుముందు, ఓపెనర్లు మాథ్యూ షార్ట్ (11), ప్రభ్ సిమ్రన్ సింగ్ (26) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వన్ డౌన్ బ్యాటర్ అధర్వ తైదే 29, లియామ్ లివింగ్ స్టోన్ 10 పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 2, పియూష్ చావ్లా 2, అర్జున్ టెండూల్కర్ 1, జాన్ బెహ్రెండార్ఫ్ 1, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశారు.

More Telugu News