Narendra Modi: మోదీ పర్యటనకు ఉగ్ర బెదిరింపు.. కేరళలో హై అలర్ట్!

  • ప్రధాని పర్యటనలో ఆత్మాహుతి దాడి చేస్తామంటూ లేఖ కలకలం
  • బీజేపీ స్టేట్ ఆఫీసుకు లెటర్ పంపిన దుండగులు
  • భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు, నిఘా వర్గాలు
  • ఈనెల 24న కేరళలో పర్యటించనున్న మోదీ
Kerala on high alert after threat letter received against PM Modis visit

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై దాడి చేస్తామంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. కేరళలోని కొచ్చిలో ప్రధాని ఈ నెల 24న పర్యటించాల్సి ఉండగా.. ఆత్మాహుతి దాడి చేస్తామంటూ లెటర్ లో బెదిరించారు. ఈ లేఖను బీజేపీ కేరళ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు పంపారు. దీంతో కేరళలో హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

కేరళలో ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్, కొచ్చి వాటర్ మెట్రోను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న కేరళలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి ఈ లేఖ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్నాకులం ప్రాంతానికి చెందిన జోసఫ్ జెన్నీ అనే వ్యక్తి ఈ లెటర్ పంపినట్టు వెల్లడించారు.

లెటర్ లో పేరు ఉన్న వ్యక్తి మాత్రం.. తాను ఎలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశాడు. తనకు గిట్టని వాళ్లే ఈ పని చేసినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు పెంచారు. నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరిన్ని వివరాలను సేకరిస్తున్నాయి.

మరోవైపు సెక్యూరిటీ డ్రిల్స్ కు సంబంధించి ఏడీజీపీ జారీ చేసిన లెటర్ మీడియాలో లీక్ అయింది. అందులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సహా పలు ముప్పులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేరళకు చెందిన బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి ఎం.మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడీజీపీ లేఖ లీక్ కావడం.. తీవ్రమైన భద్రతా లోపమని విమర్శించారు. షెడ్యూల్ ప్రకారమే ప్రధాన మంత్రి పర్యటన కొనసాగుతుందని తెలిపారు.

More Telugu News