West Bengal: దాని కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమే: మమతా బెనర్జీ

  • ద్వేషపూరిత రాజకీయాలతో దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని బీజేపీపై విమర్శలు
  • దీన్ని అడ్డుకునేందుకు ప్రాణాలైన ఇస్తానని వ్యాఖ్య
  • బెంగాల్ లో ఎన్ఆర్సీని అనుమతించబోనన్న మమతా
Ready To Give My Life But says Mamata Banerjees Jab At BJP On Eid

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  మరోసారి విమర్శలు సంధించారు. ద్వేషపూరిత రాజకీయాలను అనుసరించడం ద్వారా దేశాన్ని విభజించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని అడ్డుకునేందుకు తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. శనివారం కోల్ కతాలో జరిగిన రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్న బెనర్జీ  ప్రజలంతా ఏకం కావాలని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మితవాద బీజేపీ పార్టీని ఓడించాలని కోరారు. ‘దేశాన్ని విభజించి ద్వేషపూరిత రాజకీయాలు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. నేను ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నాను కానీ దేశ విభజనను మాత్రం అనుమతించబోను. కాషాయ శిబిరం దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

పశ్చిమ బెంగాల్‌లో ఎన్ఆర్సీ అమలును తాను అనుమతించబోనని స్పష్టం చేశారు. పొరుగు దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వ హక్కులను కల్పించే జాతీయ పౌర రిజిస్టర్, పౌరసవరణ చట్టం అవసరమే. దానికి ఇప్పటికే ఉన్న పౌరసత్వ రికార్డులు, చట్టాలు సరిపోతాయన్నది టీఎంసీ వాదన’ అని తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థుల ధనబలం, కేంద్ర ఏజెన్సీలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎట్టిపరిస్థితుల్లోనూ తల వంచనని తేల్చి చెప్పారు. ‘ఒక ఏడాదిలో మన దేశంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించే ఎన్నికలు జరగనున్నాయి. విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడతామని మనం వాగ్దానం చేద్దాం. వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసి వారికి ఓటు వేద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే అంతా ముగిసిపోతుంది’ అని మమత పేర్కొన్నారు.

More Telugu News