Ben Stokes: చెన్నైకి ఎదురుదెబ్బ.. గాయంతో వారంపాటు జట్టుకు బెన్‌స్టోక్స్ దూరం

  • చెన్నై జట్టును వేధిస్తున్న ఆటగాళ్ల గాయాల బెడద
  • కాలి వేలి గాయంతో జట్టుకు దూరమైన బెన్‌స్టోక్స్
  • ధోనీ గాయం గురించి ఆందోళన వద్దన్న కోచ్ ఫ్లెమింగ్
Ben Stokes has suffered injury setback and will be out for a week

గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వారం రోజులపాటు జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిర్ధారించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడైన స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ నెల 8న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ కాలివేలికి గాయమైంది. ఆ తర్వాత స్టోక్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మరో వారం తర్వాత కానీ అతడు జట్టులోకి వచ్చే అవకాశం లేదు. 

స్టోక్స్‌కు అయిన గాయం మరీ పెద్దదేం కాదన్న ఫ్లెమింగ్.. జట్టుకు ఇది కొంత ఎదురుదెబ్బేనని అన్నాడు. అలాగే, ధోనీ మోకాలి గాయం గురించి మాట్లాడుతూ.. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. గాయం మరీ భరించలేకుండా ఉండి తానిక ఆడలేనని తెలిస్తే ధోనీ తనంత తానే తప్పుకుంటాడని అన్నాడు. కాబట్టి అతడి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గాయాలబారినపడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీపక్ చాహర్, సిసంద మంగళ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఇక, పేసర్ సిమర్‌జీత్ సింగ్ గాయం కారణంగా గత దేశవాళీ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇప్పుడు బెన్‌స్టోక్స్ వారం రోజులపాటు జట్టుకు దూరంగా ఉండనున్నాడు.

More Telugu News