Mumbai Police: వర్ధమాన మోడల్స్‌ను వ్యభిచార కూపంలోకి నెడుతున్న భోజ్‌పురి నటి అరెస్ట్

Mumbai police arrests Bhojpuri actress Suman Kumari for forcing models into prostitution
  • సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వచ్చి ఇబ్బందులు పడుతున్న మోడల్సే టార్గెట్
  • రోజుకు రూ. 50-80 వేలతో మోడల్స్‌ను పంపుతున్న నటి
  • పలు భోజ్‌పురి సినిమాల్లో నటించిన సుమన్ కుమారి
వర్ధమాన మోడల్స్‌ను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్న భోజ్‌పురి నటి సుమన్ కుమారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హై ప్రొఫైల్ సెక్స్‌ రాకెట్‌కు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఆరే కాలనీ ప్రాంతంలోని రాయల్ పామ్ హోటల్‌పై దాడిచేసి నిందితురాలిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

సెక్స్ రాకెట్ సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను ట్రాప్ చేసేందుకు తొలుత ఓ నకిలీ కస్టమర్‌ను హోటల్‌కు పంపారు. రోజుకు రూ. 50 వేల నుంచి రూ. 80 వేలతో మోడల్స్‌ను పంపేందుకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. వారి మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా నటిని పట్టుకున్నారు. 

నటి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంది. ఈ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్న మిగతా వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం సుమన్ కుమారి (24) భోజ్‌పురి నటి. ఆమె కస్టమర్ల వద్దకు మోడళ్లను పంపిస్తూ ఉంటుంది. సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వచ్చి అవకాశాల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారితో సుమన్ కుమారి పరిచయం పెంచుకుంటుంది. ఆ తర్వాత వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 

ఈ హై ప్రొఫైల్ సెక్స్‌ రాకెట్‌లో నటి సుమన్ కుమారి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చాలా భోజ్‌పురి సినిమాల్లో సుమన్ కుమారి నటించింది. లైలా మజ్ను సినిమాతోపాటు ‘బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ’ వంటి కామెడీ షోలు కూడా చేసింది. బూమ్ ఓటీటీ చానల్‌లోనూ పనిచేసింది. సుమన్ కుమారి ఆరేళ్లుగా ముంబైలో నివసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె సెక్స్ రాకెట్‌ను ఎప్పటి నుంచి నడుపుతోందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.
Mumbai Police
Bhojpuri Actress
Suman Kumari

More Telugu News