Nara Lokesh: ఈ విజువల్ చూస్తే జగన్ ముఖచిత్రం మాడిపోవడం ఖాయం: లోకేశ్

  • ఆదోనిలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • ఆదోని అదిరిపోయిందన్న లోకేశ్
  • విశేషంగా తరలివచ్చిన శ్రేణులు
  • 2024లో జగన్ లండన్ లో కాపురం పెడతాడన్న టీడీపీ యువనేత 
  • రాష్ట్రంలో మార్పు మొదలైందని వెల్లడి
Lokesh take a jibe at CM Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదోనిలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఆదోని సిరిగుప్ప సర్కిల్ లో పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయి చేరుకోవడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువగళం సైనికులు ఆనందంతో కేరింతలు కొట్టారు. యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా సిరిగుప్ప క్రాస్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేశ్... అధికారంలోకి వచ్చాక ఆదోనిలోని 21వ వార్డును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఇది తన జీవితంలో మరపురాని ఘట్టంగా అభివర్ణించారు. కాగా, రేపు (ఏప్రిల్ 22) రంజాన్ నేపథ్యంలో, నారా లోకేశ్ తన పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు. ఎల్లుండి (ఏప్రిల్ 23) యువగళం తిరిగి కొనసాగనుంది.

మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ

రంజాన్ సందర్భంగా ఆదోనిలో మైనారిటీ సోదరులకు లోకేశ్ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన తాను ఆదోనిలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తికావడానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలని ఈ సందర్భంగా కోరారు.

మార్పు మొదలైంది... త్వరలో జగన్ కు బైబై!

యువగళంతో మార్పు మొదలైందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. పరదాల జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ప్రజలు షాక్ ఇచ్చారని, దేవరాజుపల్లె ఎస్సీ కాలనీలో గడపగడపకు కార్యక్రమానికి వెళితే ఊరు మొత్తం తాళం వేసుకొని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 

"త్వరలో రాష్ట్రం మొత్తం తాళం వేసి పరదాల జగన్ కి బై బై చెప్పడం ఖాయం. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట. జగన్ కి డబ్బు లేదంట... వైసీపీ భాషలో అడుగుతున్నా దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరు? జగన్ మాటలు వింటే అబద్ధమే సిగ్గుపడుతుంది. విశాఖలో కాపురం పెడతానంటున్నాడు. నువ్వు బెంగుళూరులో కాపురం పెట్టావ్, హైదరాబాద్ లో కాపురం పెట్టావ్, తాడేపల్లిలో కాపురం పెట్టావ్, ఇడుపులపాయలో కాపురం పెట్టావ్. కాపురం పెట్టడం కాదు అమూల్ బేబీ... ఏం పీకాం అన్నది ముఖ్యం. 2024 జగన్ లండన్ లో కాపురం పెట్టడం ఖాయం. 

ఆదోని అదిరిపోయింది. ఈ విజువల్ చూస్తే జగన్ ముఖచిత్రం మాడిపోవడం ఖాయం. ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ మహాయోగి లక్ష్మమ్మ దేవాలయం, షాహి జామియా మసీదు ఉన్న పవిత్రమైన నేల ఆదోని. రాష్ట్రంలోనే అతి పెద్ద పత్తి మార్కెట్ ఉన్న ప్రాంతం ఆదోని. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ పుణ్యభూమి ఆదోనిలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం" అని లోకేశ్ పేర్కొన్నారు.

దమ్ముంటే జగన్ ను నిలదీయండి!

ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ చంద్రబాబును నిలదీస్తానని వీరంగం వేస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేసిందుకు, సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించినందుకు దమ్ముంటే జగన్ ను నిలదీయండి అని సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారని వ్యాఖ్యానించారు.  

ఆదోని ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ లీలలు

ఆదోని ఎమ్మెల్యే గారి పేరు సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటూ స్థానిక వైసీపీ శాసనసభ్యుడ్ని లోకేశ్ టార్గెట్ చేశారు. "ఆదోనిని ముంబైలా మార్చేస్తాడు అని మీరు వరుసగా రెండుసార్లు గెలిపించారు. ఆదోనికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి పంచుకున్నారు. ప్రతి రోజు కూర్చొని వాటాలు వేసుకుంటారు. కొడుకు భూకబ్జాలు, సెటిల్మెంట్లు. భార్య గారికి రిజిస్ట్రార్ ఆఫీస్ బాధ్యతలు అప్పగించారు. ఆదోనిలో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు. అందుకే పేరు మార్చాను ఆయన సాయి ప్రసాద్ కాదు క్యాష్ ప్రసాద్. ప్రతి రోజూ క్యాష్ ఎంత వచ్చిందో కళ్లారా చూసుకుంటే తప్ప ఆయనకి నిద్ర పట్టదంట!

ఆదోని పట్టణం సర్వే నంబరు 352లో 5 ఎకరాల్లో 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి ఎస్టేట్ వెంచర్ వేసింది. 72 మంది సామాన్యులు ఒకటిన్నర సెంటు ప్రకారం కొన్నారు. క్యాష్ ప్రసాద్ ఆ భూమిని కబ్జా చేసి మళ్ళీ వెంచర్ వేశారు. ప్లాట్లు కొన్న బాధితులు అడిగితే.. ఒకటిన్నర సెంటుకు రూ.లక్ష ఇస్తా... లేదంటే మీ ఇష్టం అని బెదిరిస్తున్నారు. అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా ఉంది. ప్రస్తుతం ఎకరా రూ.10 కోట్లు ఉంది. 

క్యాష్ ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ మండిగిరి కొండ, కొండాపురం కొండని మింగేసారు. డాణాపురం వద్ద 172ఎకరాలు సెంటు స్థలాల కోసం, ఆరెకల్ మెడికల్ కాలేజీ కోసం 43 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. భూమి కొనుగోళ్లలో క్యాష్ ప్రసాద్ గారికి భారీగానే ప్రజాధనాన్ని లూటీ చేసారు. ఎకరా రూ.6 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.13 లక్షలకు అమ్మేసారు" అని లోకేశ్ వివరించారు. 

ఎస్కేడీ కాలనీలో ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా ఏపీ ఎన్జీఓ ఆఫీసు ఉందని, ఎన్జీఓలను భయపెట్టి.. 32 ఏళ్లు లీజుకు రాయించుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ఆఫీసు కట్టారని తెలిపారు. ఎమ్మెల్యే కొడుకు మనోజ్ రెడ్డి బియ్యం మాఫియా నడుపుతున్నారని వెల్లడించారు.

బెంజ్ మంత్రి గారూ బీపీ, బూతులు ఎందుకు?

మంత్రి గుమ్మనూరు జయరాం తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నారా లోకేశ్ స్పందించారు. నేను అడిగిన దానికి తప్ప ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ నోరు పారేసుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. 

"ఈఎస్ఐ స్కాంపై చర్చకు సిద్దం అంటున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో స్కాంకి పాల్పడి మీరు బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారు అని ఆధారాలతో సహా ఎన్నో సార్లు బయటపెట్టాం. అదే కారులో మీ ముద్దుల కుమారుడు షికార్లు కొట్టడం రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఏమి తెలియనట్లు ఈఎస్ఐ స్కాంపై చర్చకు సిద్దమా అంటూ సవాల్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వంలో ఉంది మీరు అనే విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి. 

బెంజ్ మంత్రి గారూ మీ ఆవు కథలు ఆపండి. నేను నా సవాల్ కి కట్టుబడి ఉన్నాను. ఎవరైనా ముందు కోస్తే భూములు రైతుల పేరిట రాయడానికి సిద్దం అని మీరే పబ్లిక్ గా ప్రకటించారు. ఇప్పుడు వెనక్కి తగ్గి బూతులతో విరుచుకుపడుతున్నారు. అధికారంలో ఉంది మీరు, ప్రతిపక్షంలో ఉంది మేము అని గుర్తించి ఆరోపణలు చెయ్యగలరని ఆశిస్తున్నాను" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.


*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 1004.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.1 కి.మీ.*

*రంజాన్ సందర్భంగా 22-4-2023న పాదయాత్రకు విరామం*

*23వ తేదీన (ఆదివారం) యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుంది.*

*****

More Telugu News