ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- ఏప్రిల్ 22న రంజాన్ పండుగ
- ఇది దివ్య ఖురాన్ అవతరించిన మాసం అని పవన్ వెల్లడి
- ముస్లింల లోగిళ్లు ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంటాయని వివరణ
- రంజాన్ నేపథ్యంలో భారత్ లో మత సామరస్యం వెల్లివిరుస్తుందని వ్యాఖ్యలు
దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ఉపవాసాలు, నిత్య ప్రార్థనలతో ముస్లింల లోగిళ్లన్నీ ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంటాయని వివరించారు. మానవత్వ విలువలను ద్విగుణీకృతం చేయాలని చాటిచెప్పే హితవచనాలు మానవాళి మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా, రంజాన్ పండుగలో భారతదేశంలో మత సామరస్యం వెల్లివిరుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులలో ముస్లింలతో పాటు ఇతర మతస్తులు అధికంగా పాల్గొనడం మనం భారతదేశంలో మాత్రమే ఎక్కువగా చూస్తామని పవన్ తెలిపారు.
దేశంలోనూ, ప్రపంచమంతటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ, ఇస్లాంపై నమ్మకం ఉన్నవారందరికీ తన తరఫున, జనసేన తరఫున ఈద్ ముబారక్ అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.