Yanamala: ఆంధ్రప్రదేశ్ లో దొంగలు పడ్డారు: యనమల

  • డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జగన్ విశాఖలో కాపురం ప్రకటన అన్న యనమల 
  • ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులు, సదస్సుల పేరుతో హడావుడి అంటూ ఎద్దేవా 
  • గంజాయి రవాణాలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారంటూ విమర్శ  
yanamala ramakrishnudu press note

అధికారంలోకి వచ్చాక అరాచకం తప్పించి అభివృద్ధి ఊసే ఎత్తని ముఖ్యమంత్రి జగన్.. ఎవరిని ఉద్ధరించడానికి విశాఖపట్నంలో కాపురం పెడతా అంటున్నారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని తాడేపల్లి నేలమాళిగలు నింపుకున్నది చాల్లేదా? ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపేశారు. విశాఖలో రాజధాని మాటున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారు. దోచుకున్నది సరిపోక మళ్లీ విశాఖలో కాపురం అంటున్నారా? మీరు మోపిన ధరల భారం, పన్నుల మోతతో పేదలు కడుపునిండా తినే పరిస్థితిలేదని విమర్శించారు. 

జే ట్యాక్స్ తో పారిశ్రామికవేత్తలు పారిపోయారు..
నాలుగేళ్ల పాలనలో కొత్త పరిశ్రమల ఊసే ఎత్తని ముఖ్యమంత్రి.. ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులు, సదస్సుల పేరుతో హడావుడి చేస్తున్నారని యనమల ఆరోపించారు. జే ట్యాక్స్ చెల్లించలేక పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంటే.. జాబ్ క్యాలెండర్ అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ చేసిన అరాచకాలు చాలక విశాఖ వెళతారా? అని జగన్ ను నిలదీశారు. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన పథకాలలో కొన్నింటిని రద్దుచేసి, మిగతా వాటి పేర్లు మార్చడం తప్ప మీరు చేసింది ఏముందని జగన్ ను ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారని యనమల రామకృష్ణుడు నిలదీశారు.

మంత్రుల ఆర్భాటపు ప్రకటనలు..
ఓవైపు నిధులు లేక సంక్షేమ పథకాలు వాయిదా వేశామని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెబుతుంటే, మంత్రులేమో రాష్ట్రానికి పెట్టుబడుల వరద అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారని యనమల విమర్శించారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని ఆరోపించారు. పథకాల మాటున భారీ అవినీతికి పాల్పడ్డారని, అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచున నిలబెట్టింది జగనేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ సర్కారు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిందని, దీంతో ఒక్కో కుటుంబంపై నాలుగున్నర లక్షల రుణభారం పడిందని ఆరోపించారు. 

కడప స్టీల్ ప్లాంట్ కు ఇప్పుడు మీరు చేసిందేంటి..?
కడప స్టీల్ ప్లాంట్ కు గతంలో శంకుస్థాపన చేసి టీడీపీ ప్రభుత్వం భూములు కూడా కేటాయించింది. ఇప్పుడు మీరు కొత్తగా చేసింది ఏముందో చెప్పగలరా అంటూ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలన వల్ల ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి పడిపోయిందని యనమల రామకృష్ణుడు చెప్పారు.

గంజాయి రవాణాలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేశారు..
ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ను జగన్ ప్రభుత్వం గంజాయి రవాణాలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిందని యనమల ఎద్దేవా చేశారు. పేదల బతుకును దుర్భరంచేసిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడినా, విశాఖలో కాపురం పెట్టినా ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. జగన్ చేసే గిమ్మిక్కులను జనం నమ్మేస్థితిలో లేరని, ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఎప్పుడు ఈయనను సాగనంపుదామా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. జగన్ స్వయంగా జనాల చుట్టు చక్కర్లు కొట్టినా ప్రయోజనం శూన్యమని, వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి, టీడీపీ గెలుపు ఖాయమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

More Telugu News