united nations: 1950లో హైదరాబాద్‌ జనాభా 10 లక్షలు.. మరి ఇప్పుడు?

  • హైదరాబాద్‌ జనాభా 1.05 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్యసమితి 
  • దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఆరో స్థానం
  • ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచిన భాగ్యనగరం 
united nations population division revealed hyderabad population has reached 1 crore

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ జనాభా 1.05 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరనుందని పేర్కొంది. తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలవగా.. ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచింది.

1950లో హైదరాబాద్‌ జనాభా 10 లక్షలు. 1975 నాటికి 20 లక్షలకు పెరిగింది. 1990లో 40 లక్షలకు, 2010 నాటికి 80 లక్షలకు పెరిగింది. గతంలో హైదరాబాద్‌ అంటే ఎంసీహెచ్‌ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే. జీహెచ్‌ఎంసీ ఏర్పాటుతో 650 చదరపు కిలో మీటర్ల పరిధికి విస్తరించింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. ప్రతీ ఏడాది 5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వస్తున్నారు. 

1591లో హైదరాబాద్ ను ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ రాజధానిగా, 2014 నుంచి తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది. ఏపీ విభజన చట్టం ప్రకారమైతే.. 2024 దాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇంకా కొనసాగుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్ జనాభాలో 64.93 శాతం హిందువులు, 30.13 శాతం ముస్లింలు, 2.75 శాతం క్రైస్తవులు, 2.19 శాతం ఇతర మతాలకు చెందినవారు ఉన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలు 25 శాతం మంది వరకు ఉన్నారు. 60 శాతం పైగా జనాభా 15 నుంచి 64 ఏళ్ల మధ్యలోని వారే కావడం విశేషం.

More Telugu News