Atiq Ahmed: అతీక్ అహ్మద్ ను చంపేందుకు నిందితులు రిపోర్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారట!

  • అతీక్ అహ్మద్ సోదరుల హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
  • ప్రధాన నిందితుడికి స్థానికంగా సహకరించిన ముగ్గురు జర్నలిస్టులు
  • రిపోర్టింగ్ చేయడంలో శిక్షణ, కెమెరా కొనుక్కునేందుకు సాయం చేసిన వైనం
  • ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
Atiq Ahmed Killer Received Crash Course In Reporting says Police

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు ఆష్రఫ్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. జర్నలిస్టుల్లా నటిస్తూ.. పోలీసుల సమక్షంలోనే అతీక్ సోదరులను నిందితులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అతీక్ అహ్మద్, ఆష్రఫ్‌లపై కాల్పులు జరపడానికి ముందు.. హంతకులు లవ్లేష్ తివారీ, అరుణ్ మౌర్య, సన్నీ సింగ్‌లు రోజంతా జర్నలిస్టుల ముసుగులో వెంబడించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఈ కేసులో ప్రధాన నిందితుడికి స్థానికంగా ముగ్గురు జర్నలిస్టులు సహకరించినట్టు తాజాగా వెల్లడైంది. ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశామని పోలీసులు గురువారం వెల్లడించారు. స్థానిక న్యూస్ వెబ్ సైట్ లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు.. రిపోర్టింగ్ చేయడంలో తివారీకి శిక్షణ ఇచ్చారు. కెమెరా కొనుక్కునేందుకు సాయం చేశారు. ఈ ముగ్గుర్ని ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరోవైపు కౌశాంబిలో అతిక్ అహ్మద్ భార్య షయిస్తా పర్వీన్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ‘‘అతీక్ అహ్మద్ భార్య షయిస్తా పర్వీన్ నివాసంలో కొంతమంది నేరస్థులు దాక్కున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టాం. ఈ ఆపరేషన్ 2 గంటల పాటు కొనసాగింది.. డ్రోన్ కెమెరాను కూడా వినియోగించాం. అయితే పర్వీన్ నివాసంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు’’ అని సీనియర్ పోలీస్ అధికారి సమర్ బహదూర్ తెలిపారు.

బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు ఆష్రఫ్ అహ్మద్‌లను శనివారం రాత్రి జైలు నుంచి వైద్య పరీక్షలకు తరలించిన సమయంలో నిందితులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా సమక్షంలో లైవ్ లోనే 20 కన్నా ఎక్కువ సార్లు కాల్పులు జరపడంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అంతకుముందు అతీక్ కొడుకు అసద్.. పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.

More Telugu News