retail investors: 9 నెలల్లో మార్కెట్ నుంచి వెళ్లిపోయిన 53 లక్షల మంది ఇన్వెస్టర్లు

  • ఎన్ఎస్ఈ డేటా ద్వారా వెల్లడి 
  • రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం డౌన్
  • ఇన్వెస్టర్లపై ప్రతికూల పరిస్థితుల ప్రభావం
53 lakh people left stock market in 9 months

కరోనా మహమ్మారి అడుగు పెట్టిన కాలాన్ని గుర్తు చేసుకోండి. 2020 మార్చి లో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. ఆ తర్వాత నుంచి ర్యాలీ బాట పట్టాయి. లాక్ డౌన్ లతో ప్రజలు చాలా మంది తమ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అది స్టాక్ మార్కెట్లకు ఒక విధంగా మద్దతుగా నిలిచింది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం లక్షలాది మంది ఈక్విటీ మార్కెట్లోకి వచ్చారు. డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు పెద్ద రద్దీయే నెలకొంది. 

కానీ, ఆ తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఫలితంగా గత 9 నెలల కాలంలో యాక్టివ్ క్లయింట్లు 53 లక్షలు తగ్గిపోయినట్టు ఎన్ఎస్ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన తొమ్మిది నెలలుగా (మార్చి వరకు) యాక్టివ్ క్లయింట్ల సంఖ్య నెలనెలా తగ్గుతూ వస్తోంది. మార్చి చివరికి 3.27 కోట్లకు పరిమితమైంది. కానీ 2022 జూన్ నాటికి ఇది 3.8 కోట్లుగా ఉండడం ఇక్కడ గమనార్హం. 

కరోనా కొంత తగ్గిన తర్వాత కూడా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి నుంచే పనిచేశారు. దాంతో ట్రేడింగ్ కు, ఈక్విటీ ఇన్వెస్టింగ్ కు వెసులుబాటు లభించింది. 2022-23 సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గడిచిన మూడు సంవత్సరాల్లో తక్కువగా నమోదయ్యాయి. 2020-21లో రూ.68,400 కోట్లను రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులుగా పెట్టగా, 20221-22లో రూ.1.65 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కానీ 2022-23లో కేవలం రూ.49,200 కోట్లనే పెట్టుబడి పెట్టారు. అంతేకాదు రిటైల్ ఇన్వెస్టర్ల సగటు రోజువారీ టర్నోవర్ ఎన్ఎస్ఈలో మార్చి నెలకు సంబంధించి 29 శాతం తగ్గి రూ.23,700 కోట్లుగానే ఉంది. 

కరోనా తర్వాత ఈక్విటీ మార్కెట్లు బుల్ ర్యాలీ చేశాయి. గత ఏడాదిన్నర కాలంలో ఈక్విటీ ఎన్నో ప్రతికూల అంశాల ప్రభావంతో డౌన్ సైడ్ ప్రయాణం చేస్తున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కువగా నష్టపోయాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తోంది.

More Telugu News