YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు ప్రపంచ పోలీసులకు ఓ కేస్ స్టడీ లాంటిది: చంద్రబాబు

  • గొడ్డలితో చంపి, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారంటూ ఆరోపణ
  • సీబీఐ అధికారులను నిందితులు బెదిరించారని వివరణ
  • రౌడీల తోకలు కట్ చేస్తా... జాగ్రత్త అంటూ హెచ్చరిక
  • జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్న టీడీపీ అధినేత
Chandrababu Naidu lashes out at YS Jagan

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు... ప్రపంచ పోలీసు అధికారులకు ఓ కేస్ స్టడీ వంటిదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆయన కడపలో ఏర్పాటు చేసిన టీడీపీ జోన్-5 సమావేశంలో మాట్లాడారు. వివేకాను గొడ్డలితో నరికి చంపి, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వివేకా హత్య కేసు నిందితులు చివరకు సీబీఐ అధికారులను కూడా బెదిరించారన్నారు. తన తండ్రిని చంపిన వారు ఎవరో తెలియాలని వివేకా కుమార్తె పోరాడుతోందన్నారు. వివేకా హత్య కేసును ప్రజా కోర్టులో పెడతామన్నారు.

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలని పిలుపునిచ్చారు. సీమలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా అణిచివేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. కానీ జగన్ హయాంలో రౌడీలు రెచ్చిపోతున్నారన్నారు. రౌడీల తోకలు కట్ చేస్తాం... జాగ్రత్త! అంటూ హెచ్చరించారు. అడ్డువచ్చిన వారిని అందరినీ చంపేస్తారా అని ధ్వజమెత్తారు. 

పరిపాలన చేయాలని రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటు వేశారని, కానీ హత్యలు, దౌర్జన్యాలు, బలహీన వర్గాల పైన దాడులు పెరిగాయన్నారు.

టీడీపీ హయాంలో పెట్టుబడులు

తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీకి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వచ్చామని చంద్రబాబు అన్నారు. కియా మోటార్స్ తో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కానీ జగన్ మాత్రం కడప స్టీల్ ప్లాంట్ కు మూడుసార్లు ఫౌండేషన్ స్టోన్ వేశారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే కడప స్టీల్ ప్లాంట్ పూర్తయ్యేదని చెప్పారు. జాబు రావాలంటే టీడీపీ రావాల్సిందే అన్నారు. జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తి కాదని, అప్పుడు శ్రీశైలంకు నీళ్లు రావని, తద్వారా రాయలసీమకు నీళ్లు రావన్నారు. అంటే రాయలసీమ ద్రోహిగా జగన్ నిలిచిపోతారన్నారు. తాము పట్టిసీమను పూర్తి చేశాం కాబట్టే ఇప్పుడు అక్కడ నీరు వస్తోందన్నారు.

జగన్ రాష్ట్రానికి దరిద్రం

జగన్ రాష్ట్రానికి ఓ దరిద్రమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "ఆయన ఒక సైతాన్... రాష్ట్రానికి పట్టిన శని... మనల్ని పట్టిపీడిస్తున్న భూతం" అని అన్నారు. తాను నాలుగేళ్లుగా చూస్తున్నానని, ఒక్కరు కూడా ఈ పాలనలో కంటినిండా నిద్ర పోవడం లేదన్నారు. పోలీసులు కూడా ఆనందంగా లేరన్నారు. వారికి డీఏలు లేక, వేతనాలు సరిగ్గా రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, ఎస్సీ, ఎస్టీలు, వ్యాపారులు, ఉద్యోగులు... ఇలా ఎవరి పరిస్థితీ బాగా లేదన్నారు.

ఈ పథకాలు ఎక్కడ?

టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్, చంద్రన్న భరోసా, విదేశీ విద్య వంటి పథకాలు ఉన్నాయని, అవన్నీ ఇప్పుడు ఎక్కడ? అని నిలదీశారు. పండుగలకు ఇచ్చే కానుకలు, రంజాన్ తోఫా, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. అభివృద్ధికి మారుపేరు టీడీపీ అన్నారు. ఇవన్నీ చూపించి మనం వైసీపీకి సెల్ఫీ ఛాలెంజ్ చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

More Telugu News