GV Harshakumar: అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు: హర్షకుమార్

  • కోడి కత్తి శ్రీను విషయంలో జగన్ స్పందించాలన్న హర్షకుమార్
  • శ్రీను రాసిన లేఖను బయటపెట్టాలని డిమాండ్
  • రాజమహేంద్రవరం జైలులో ఉండగా శ్రీను తనను తరచూ కలిసేవాడన్న మాజీ ఎంపీ
Congress Leader GV Harsh Kumar Asks Jagan To Respond On Kodi Kathi Srinu

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మల్లెల బాబ్జీ అనే దళితుడు ఆయనపై చాకుతో దాడి చేసిన విషయాన్ని హర్షకుమార్ గుర్తు చేశారు. ఆ కేసులో ఎన్టీఆర్ స్వయంగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. బాబ్జీకి క్షమాభిక్ష పెట్టమని కోరి ఆయనను  బయటపడేశారని తెలిపారు. 

ఇప్పుడు కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను కూడా దళితుడేనని, అయితే ఈ విషయంలో వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ కోర్టుకు వచ్చేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. అక్కడితో ఆగకుండా కుట్ర కోణంలో దర్యాప్తు చేయమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీను రాసిన లేఖను ఎన్ఐఏ బయటపెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. అలాగే, జగన్ కోర్టుకెళ్లి వాంగ్మూలమిచ్చి శ్రీనును బయటపడేయాలని కోరారు.

తాను రాజమహేంద్రవరం జైలులో ఉన్నప్పుడు శ్రీను తరచూ కలిసేవాడని హర్షకుమార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అప్పుడు శ్రీను తనతో మాట్లాడుతూ.. తాను రాసిన ఉత్తరాన్ని ఎలాగైనా బయటపెట్టించాలని కోరాడని అన్నారు. అది బయటకు వస్తే తన నిజాయతీ ఏంటో తెలుస్తుందని అన్నాడని పేర్కొన్నారు. 

తాను జగన్ అభిమానినని, జగన్‌కు సానుభూతి వస్తుందనే అలా చేశానని చెప్పాడని, ఆయన కుటుంబ సభ్యుడిగా తనను గుర్తిస్తారనే అలా చేశానని శ్రీను తనతో చెప్పాడని హర్షకుమార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాబట్టి జగన్ ఈ విషయంలో స్పందించి  అతడు బయటపడేలా చూడాలని కోరారు.

More Telugu News