USA: కారులో నుంచి డాలర్లు వెదజల్లిన యువకుడు.. అమెరికాలో హైవేపైన కార్లు ఆపి నోట్ల కోసం ఎగబడ్డ జనం

  • ఒరెగాన్ లోని హైవే పైన ఘటన
  • యువకుడిపై మండిపడుతున్న కుటుంబ సభ్యులు
  • ఉమ్మడి ఖాతాను ఊడ్చేసి ఈ పిచ్చిపని చేశాడని పోలీసులకు ఫిర్యాదు
  • ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీలేదన్న పోలీసులు
  • డబ్బు తిరిగివ్వాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన యువకుడి ఫ్యామిలీ
Man Throws Rs One and half crore Cash Out His Car To Bless Others

ఆర్థికంగా బాగున్నాను.. ఇతరులకూ కొంత సాయం చేద్దామని అమెరికా యువకుడు ఒకరు హైవేపైన డాలర్ల వర్షం కురిపించాడు. కారులో నుంచి వంద డాలర్ల నోట్లను బయటకు వెదజల్లాడు. దీంతో వెనక కార్లలో వస్తున్న జనం తమ వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేసి, నోట్లు ఏరుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో చోటుచేసుకుందీ ఘటన. అయితే, సదరు యువకుడి కుటుంబం మాత్రం ఇది పిచ్చి చేష్ట అని, తమ ఖాతాలో సొమ్మంతా ఖాళీ చేసి తమను రోడ్డుమీదికి లాగాడని వాపోతోంది.

ఒరెగాన్ కు చెందిన కొలిన్ డేవిస్ మెక్ కార్తీ అనే యువకుడు ఈ నెల 11న హైవే పైన కారులో ప్రయాణిస్తూ 2 లక్షల విలువైన (సుమారు రూ.1.6 కోట్లు) వంద డాలర్ల నోట్లను బయటకు విసిరేశాడు. బిజీగా ఉన్న హైవేపైన ఒక్కసారిగా నోట్ల వర్షం కురియడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. కార్లలో నుంచి దిగిన జనం వంద డాలర్ల నోట్లను ఏరుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

ఈ ఘటనపై మెక్ కార్తీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ ఖాతాలో నుంచి సొమ్మంతా తీసి ఇలా విసిరేశాడని, కుటుంబం మొత్తాన్నీ రోడ్డుమీదికి లాగాడని ఆరోపించారు. అయితే, బ్యాంకు ఖాతా ఉమ్మడి ఖాతా కావడంతో తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. దీంతో తమ పరిస్థితిని వివరిస్తూ.. నోట్లు దొరికిన వారు ఒరెగాన్ పోలీసులకు అప్పగించాలంటూ మెక్ కార్తీ కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News