Karnataka: కర్ణాటక బీజేపీకి మరో భారీ షాక్.. నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న జగదీశ్ షెట్టర్!

  • మూడు రోజుల క్రితం పార్టీని వీడిన లక్ష్మణ్ సవది
  • నిన్న పార్టీకి రాజీనామా చేసిన జగదీశ్ షెట్టర్
  • నేడు కాంగ్రెస్ చీఫ్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్న జగదీశ్ షెట్టర్
Former Karnataka CM Jagadish Shettar quits BJP Joins Congress Today

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టికెట్ నిరాకరించడంతో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది మూడు రోజుల క్రితం బీజేపీకి టాటా చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన నేడు పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. 

బీజేపీలో టికెట్ దక్కని ఆశావహులు, అనుచరులతో కలిసి నిన్న రెండు విమానాల్లో హుబ్బళ్లి నుంచి బెంగళూరు చేరుకున్న జగదీశ్ షెట్టర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన స్పీకర్ విశ్వేశ్వరహెగ్డే కాగేరిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షెట్టర్‌కు ఈసారి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆ స్థానం నుంచి కొత్త వారిని బరిలోకి దించాలని నిర్ణయించింది. దీంతో పార్టీపై కినుక వహించిన జగదీశ్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు.

More Telugu News