sarus crane: అడ్డుగా ఇనుప కంచె.. తనను కాపాడిన మిత్రుడి దగ్గరికి వెళ్లేందుకు పక్షి ఆరాటం.. హృదయాలను కదిలించే వీడియో!

  • కొంగను కాపాడి తనతోనే ఉంచుకున్న మహ్మద్ ఆరిఫ్
  • కొన్నిరోజుల కిందట కొంగను తీసుకెళ్లిన అటవీ అధికారులు
  • కాన్పూర్‌లోని జూకు తరలింపు.. చూసేందుకు వెళ్లిన ఆరిఫ్
  • అతడి దగ్గరికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించిన కొంగ
up sarus crane in kanpur zoo reaction after seeing arif melts hearts

ఉత్తర ప్రదేశ్‌‌లోని అమేథీకి చెందిన మహ్మద్ ఆరిఫ్, సారస్ కొంగ మధ్య స్నేహం ఇటీవల దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కానీ అది రాజకీయ రంగు పులుముకోవడంతో.. కొన్ని రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు అతడికి నోటీసులు ఇచ్చి కొంగను తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం కాన్పూర్‌లోని జూలో దాన్ని ఉంచారు. 

అధికారుల అనుమతి తీసుకుని, కొంగను చూసేందుకు కాన్పూర్ జూకు ఆరిఫ్ వెళ్లాడు. రెండు వారాల తర్వాత ఆరిఫ్‌ను చూసిన కొంగ వెంటనే గుర్తుపట్టింది. చూడగానే తల ఆడిస్తూ.. రెక్కలు కొడుతూ.. ఎగురుతూ.. ఎన్‌క్లోజర్‌లో అటు ఇటు తిరుగుతూ.. అతడి వద్దకు ఎలాగైనా సరే రావాలని ఆరాటపడింది. తన ప్రాణాలను కాపాడి, తనతో సావాసం చేసిన మిత్రుడిని కలిసేందుకు ఎన్‌క్లోజర్‌ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ వెళ్లలేకపోయింది.

జూ అధికారులు కొంగను చూసేందుకు మాత్రమే ఆరిఫ్ కు అనుమతి ఇచ్చారు. దీంతో కొద్ది దూరం నుంచే ఆరిఫ్ చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్షి ఆరాటాన్ని చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ‘‘దయచేసి ఆ కొంగను వదిలిపెట్టండి. తిరిగి ఆరిఫ్ వద్దకు పంపండి’’ అని కోరుతున్నారు. ‘పక్షిని బంధించడం బాధిస్తోంది’ అని కామెంట్ చేస్తున్నారు. 

గతంలో ఆరిఫ్‌కు పొలంలో నడవలేని, ఎగరలేని స్థితిలో సారస్ కొంగ కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లి కాపాడాడు. కొన్ని రోజులు గదిలో ఉంచాడు. కోలుకున్న తర్వాత బయటికి వదలగా.. అది వెళ్లలేదు. అతడితోనే ఉండిపోయింది. ఆరిఫ్‌తో కలిసి తినడంతోపాటు.. అతడు ఎక్కడికి వెళ్తే.. అక్కడకు ఎగురుకుంటూ వెళ్లేది. బైక్ మీద వెళ్తున్న ఆరిఫ్‌ను కొంగ ఎగురుతూ అనుసరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సైతం ఆరిఫ్ ఇంటికి వెళ్లి.. కొంగతో అతడి స్నేహాన్ని చూసొచ్చారు. ఆ తర్వాత అటవీ అధికారులు కొంగను తీసుకెళ్లారు.

More Telugu News