Rinku Singh: తండ్రి గ్యాస్ డెలివరీ బాయ్, అన్న స్వీపర్.. రింకూ సింగ్ జీవితంలో కష్టాలెన్నో!

  • ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి స్టార్ గా మారిన
     కేకేఆర్ బ్యాటర్ రింకూ
  • యూపీలోని అలీగఢ్ లో నిరుపేద కుటుంబంలో పుట్టిన యువ క్రికెటర్
  • 2018లో కేకేఆర్ జట్టులో చేరడంతో తీరిన కష్టాలు 
 Rise Of KKR Hero Rinku Singh

ఐపీఎల్ తో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. వారిలో చాలా మంది అంతర్జాతీయ స్థాయిలో మేటి ఆటగాళ్లు అయ్యారు. మెగా లీగ్ లో ఒక్కోసారి ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు. ఒక్క మ్యాచ్ విజయంతో ఎన్నో ఏళ్ల వారి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. తాజాగా ఆ జాబితాలో చేరిన యువ ఆటగాడు రింకూ సింగ్. కోల్ కతా నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన రింకూ నిన్న రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టాడు. ఆశలే లేని స్థితిలో కేకేఆర్ ను గెలిపించి హీరో అయిపోయాడు. కొన్నేళ్ల నుంచి కేకేఆర్ కు ఆడుతూ అడపాదడపా రాణిస్తున్నా నిన్నటి మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ అతడిని స్టార్ ను చేసింది. రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

అయితే, 25 ఏళ్ల రింకూ ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడ్డాడు. అతను యూపీలోని అలీగఢ్ లో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. రింకూ తండ్రి ఖాంచంద్ సింగ్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి. తన పెద్ద కొడుకు సహాయంతో సైకిల్‌పై సిలిండర్లను ఇంటింటికీ వెళ్లి వాటిని డెలివరీ చేసేవాడు. భార్య వినాతో కలిసి ఖాంచంద్ ఇప్పటికీ ఓ గ్యాస్ సిలిండర్ స్టాక్‌యార్డ్‌కు సమీపంలో ఉన్న రెండు గదుల ఇంట్లోనే నివసిస్తున్నాడు. రింకూ అన్న ఇళ్లలో స్వీపర్ గా పని చేశాడు. 

ఒక దశలో బతుకుదెరువు కోసం రింకూను కూడా అన్నతో కలిసి ఇళ్లు ఊడ్చే పనిలో (స్వీపర్) చేరమని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ, చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్న రింకూ.. ఆటతోనే పేదరికాన్ని జయించాలని అనుకున్నాడు. ఆటనే ప్రాణంగా భావించిన అతను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐపీఎల్ లో చోటు సంపాదించాడు. 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 80 లక్షలతో కొనుగోలు చేయడంతో అతని రాత మారింది. దాంతో, అతని కుటుంబం కష్టాలు కూడా తీరిపోయాయి.

‘చిన్నప్పుడు నన్ను కూడా మా అన్నతో కలిసి ఓ కోచింగ్ సెంటర్ లో స్వీపర్ గా చేరాలని ఆఫర్ వచ్చింది. క్రికెటర్ కావాలనుకున్న నాకు ఆ పని ఇష్టం లేదు. నేను క్రికెట్ ఆడతానని అందరికీ చెప్పాను. అప్పటికి ఆటలో నాకు పేరేమీ రాలేదు. కానీ, ఏదో రోజు నాకు మంచి అవకాశం లభిస్తుందని, క్రికెట్టే మా జీవితాలను మారుస్తుందని నేను విశ్వసించా. నాకు వేరే మార్గం కూడా లేదు కాబట్టి క్రికెట్‌పై దృష్టి పెట్టాను. చాలా కష్టపడ్డాను. ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలించాయి’ అని రింకూ తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు.

More Telugu News