Chandrababu: టీడీపీ నేత ముల్పూరి కల్యాణి అరెస్టుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

  • తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరెస్టును ఖండించిన చంద్రబాబు
  • తప్పుడు కేసు పెట్టింది చాలక బెడ్ రూంలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారని ఆగ్రహం
  • మహిళానేతపై హత్యయత్నం కేసు పెట్టడం సిగ్గుచేటని వ్యాఖ్య
former cm chandrababu objects to police taking Malpuri Kalyani Into custody

కష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి కల్యాణి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముల్పూరి కల్యాణిపై తప్పుడు కేసు పెట్టింది చాలక, బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్ట్ చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

ముల్పూరి కల్యాణి అరెస్టు సందర్భంగా పలు నాటకీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. నైట్ డ్రెస్‌లో ఉన్న తాను దుస్తులు మార్చుకుని వస్తానన్నా మహిళా పోలీసులు తన బెడ్ రూంలోనే ఉన్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. 

ఇక ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలకు సంబంధించి నమోదైన పలుకేసుల్లో కల్యాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే..ముందస్తు బెయిల్ రాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమె హనుమాన్ జంక్షన్‌‌లోని తన నివాసంలో ఉన్నట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News