SRH: మనోళ్లు మళ్లీ ఓడారు!

  • లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్లతో ఓడిన సన్ రైజర్స్
  • 122 పరుగుల టార్గెట్ ను 16 ఓవర్లలో కొట్టేసిన లక్నో జట్టు
  • రాణించిన కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా
  • సిక్స్ తో మ్యాచ్ ను ముగించిన నికొలాస్ పూరన్
  • వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన సన్ రైజర్స్
SRH loses again

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్-16లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయం అందుకుంది. 

ఓ దశలో సన్ రైజర్స్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ వరుస బంతుల్లో కేఎల్ రాహుల్ (35), రొమారియా షెపర్డ్ (0)లను అవుట్ చేసినా, అప్పటికే లక్నో జట్టు గెలుపుకు దగ్గరగా వచ్చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో అదిల్ రషీద్ 2, భువనేశ్వర్ కుమార్ 1, ఫజల్ హక్ ఫరూఖీ 1, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు. 

లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్ కైల్ మేయర్స్ 13, దీపక్ హుడా 7 పరుగులు చేశారు. చివర్లో మార్కస్ స్టొయినిస్ (10 నాటౌట్), నికొలాస్ పూరన్ (11 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. నటరాజన్ విసిరిన బంతిని పూరన్ ఓ సిక్స్ కొట్టడంతో సూపర్ జెయింట్స్ విజయభేరి మోగించింది. 

కాగా ఈ ఓటమి అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్-16 పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. 

తన మూడో మ్యాచ్ ను సన్ రైజర్స్ ఎల్లుండి (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. హైదరాబాదు ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. మరి సొంతగడ్డపై అయినా సన్ రైజర్స్ గెలుపు బోణీ కొడుతుందేమో చూడాలి.

More Telugu News