SRH: మార్ క్రమ్ వచ్చాడు... పోయాడు!... సన్ రైజర్స్ బ్యాటింగ్ మళ్లీ కుదేల్

  • నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు
  • తొలి బంతికే డకౌట్ అయిన కెప్టెన్ మార్ క్రమ్
  • స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సన్ రైజర్స్ తడబాటు
LSG spinners turns more as SRH continued his debacle

రెగ్యులర్ కెప్టెన్ మార్ క్రమ్ జట్టులోకి వస్తే సన్ రైజర్స్ ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో దుమ్మురేపుతారని అందరూ భావించారు. కానీ సన్ రైజర్స్ తొలి మ్యాచ్ లో ఎలా బ్యాటింగ్ చేసిందో, ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ పైనా అదే తరహాలో దారుణంగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసింది. మార్ క్రమ్ మరీ ఘోరంగా తొలి బంతికే బౌల్డయ్యాడు. దాంతో సన్ రైజర్స్ శిబిరంలోనూ, అభిమానుల్లోనూ తీవ్ర నిరాశ నెలకొంది. 

అన్ మోల్ ప్రీత్ సింగ్ 31, రాహుల్ త్రిపాఠి 35, అబ్దుల్ సమద్ 21 నాటౌట్, వాషింగ్టన్ సుందర్ 16 పరుగులు చేశారు. మయాంక్ అగర్వాల్ (8), హ్యారీ బ్రూక్ (3) విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లోనైనా తన స్థాయికి తగినట్టుగా ఆడతాడని హ్యారీ బ్రూక్ పై అభిమానులు ఆశలుపెట్టుకున్నారు. అయితే బ్రూక్ సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు. 

ఓవరాల్ గా స్పిన్ ఆడడంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు తీవ్ర తడబాటుకు గురయ్యారు. పార్ట్ టైమ్ బౌలర్ కృనాల్ పాండ్యా 3 వికెట్లు తీయడం సన్ రైజర్స్ బ్యాటర్ల వైఫల్యానికి నిదర్శనం. ఇక టీమిండియా అభిమానులు ఎప్పుడో మర్చిపోయిన సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. యశ్ ఠాకూర్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.

More Telugu News