Cheetah: ‘ఒబాన్’ దొరికింది.. ఐదు రోజుల తర్వాత అధికారులకు చిక్కిన నమీబియన్ చీతా!

  • శివపురి జిల్లాలోని ఓ గ్రామంలో ‘ఒబాన్’ను పట్టుకున్న అధికారులు
  • కృష్ణ జింకను వేటాడి ఆకలి తీర్చుకున్న చీతా
  • ఒబాన్ కోసం వెతుకుతూ పార్క్ దాటిన ‘ఆశా’
  • చీతాలు తరచూ తప్పించుకుంటుండడంపై పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన
Escaped Namibian cheetah  Asha rescued

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకుపోయిన నమీబియన్ చీతా ‘ఒబాన్’ను అధికారులు పట్టుకుని తిరిగి పార్క్‌లో వదిలిపెట్టారు. తప్పించుకుపోయిన చీతా జాడ ఐదు రోజులైనా లేకపోవడంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. చివరికి శివపురి జిల్లాలోని ఓ గ్రామంలో అది వారి కంట పడడంతో బంధించి పార్క్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టారు.

ఈ నెల 2న పార్క్ నుంచి ఒబాన్ తప్పించుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత దానిని కునో నేషనల్ పార్క్‌కు 20 కిలోమీటర్ల దూరంలో విజయ్‌పూర్‌లోని జార్ బరోడా గ్రామంలో గుర్తించారు. ఆ తర్వాతి రోజు అది పార్వతి బరోడా గ్రామంలో ఓ నదిలో నీళ్లు తాగుతూ కనిపించింది. గురువారం అది తనంత తానుగానే పార్క్ సరిహద్దుల వద్దకు చేరుకుంది.

అయితే, పార్క్‌లోకి రావాల్సిన చీతా నహద్-సిల్పురా ప్రాంతంలోని బఫర్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి అది పోహ్రి తహసీల్‌లోని పిపార్వాస్ అడవిలోకి ప్రవేశించి అక్కడే రెండు రోజులపాటు ఉండిపోయింది. ఒబాన్ బుధవారం ఓ కృష్ణ జింకను వేటాడి ఆకలి తీర్చుకుంది. గురువారం రాంపూర్ గ్రామంలో కనిపించిన ఒబాన్‌కు మత్తుమందు ఇచ్చి, ఆపై క్షేమంగా పట్టుకుని కునో పార్క్‌లో విడిచిపెట్టారు.  

తాజాగా ఆశా అనే మరో చీతా తన పార్ట్‌నర్ అయిన ఒబాన్‌ను వెతుక్కుంటూ కునో నేషనల్ పార్క్ లోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వెళ్లిపోయింది. అది వీర్ పూర్ ప్రాంతంలోని బఫర్ జోన్ లో ఉన్నట్టు గుర్తించారు. ఆశా నదుల వెంట తిరుగాడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News