RCB: కూల్చేసిన స్పిన్నర్లు.. కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన బెంగళూరు

  • బెంగళూరుపై 81 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా విజయం
  • బెంగళూరు బౌలర్లను దంచికొట్టిన శార్దూల్ ఠాకూర్
  • తొలి విజయం నమోదు చేసిన కోల్‌కతా
  • నేడు లక్నో-హైదరాబాద్ మధ్య పోరు
Shardul Thakur and spinners help KKR win against RCB

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది. గుర్బాజ్ (57), రింకు సింగ్ (46), శార్దూల్ ఠాకూర్ (68) బ్యాటింగులో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

అనంతరం 205 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు ఘనంగానే ఆరంభించినప్పటికీ ఆ తర్వాత తడబడింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మను ఎదుర్కోవడంలో విఫలమైన బ్యాటర్లు క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే వెనుదిరిగారు. 44 పరుగుల వద్ద 21 పరుగులు చేసిన కోహ్లీ వెనుదిరిగాడు. అది మొదలు వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన బెంగళూరు ఏ దశలోనూ కుదురుకోలేకపోయింది. ఫలితంగా కోల్‌కతా విజయం ఖాయమైపోయింది.  

బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ చేసిన 23 పరుగులే అత్యధికం. మైఖేల్ బ్రాస్‌వెల్ 19, డేవిడ్ విల్లీ 20, అక్ష్ దీప్ 17 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు కలిసి 17 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఫలితంగా 17.4 ఓవర్లలో 123 పరుగుల వద్ద బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు తీసుకోగా, సుయాష్ శర్మ 3, సునీల్ నరైన్ 2 వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గుర్బాజ్ 57, రింకు సింగ్ 46 పరుగులు చేయగా, ఆ తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దూల్ ఠాకూర్ వీరవిహారం చేశాడు. 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. బెంగళూరు బౌలర్లలో విల్లీ, కర్న్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. బెంగళూరుకు ఇది తొలి పరాజయం కాగా, కోల్‌కతాకు ఇది తొలి విజయం. ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య లక్నోలో మ్యాచ్ జరగనుంది.

More Telugu News