Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ నుంచి విలియమ్సన్ ఔట్!

  • ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో గాయపడిన కేన్ విలియమ్సన్
  • ఊతకర్రల సాయంతో నడుస్తున్న వీడియో వైరల్
  • మరో మూడు వారాల్లో కుడి మోకాలికి సర్జరీ
  • వన్డే ప్రపంచకప్ సెలక్షన్‌కు కేన్ అందుబాటులో ఉండడన్న కివీస్ బోర్డు
Kane Williamson likely to miss ODI World Cup

ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో గాయపడిన గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ప్రపంచకప్‌ మొత్తానికి దూరమైనట్టు తెలుస్తోంది. ఆ మ్యాచ్‌లో కుడికాలి మోకాలి గాయంతో మైదానం వీడిన కేన్.. ఆ తర్వాత చికిత్స కోసం సొంత దేశానికి చేరుకున్నాడు. ఆక్లాండ్ విమానాశ్రయంలో ఊతకర్రల సాయంతో నడుస్తున్న కేన్ వీడియో ఇటీవల వైరల్ అయింది.

కేన్‌ మోకాలికి మరో మూడువారాల్లో శస్త్రచికిత్స జరగనున్నట్టు న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జేసీ) తెలిపింది. వన్డే ప్రపంచకప్ సెలక్షన్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. కేన్ సారథ్యంలోని కివీస్ జట్టు 2019 ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆపరేషన్ అనంతరం విలియమ్సన్ పునరావాసంలో ఉంటాడని బోర్డు తెలిపింది. 

గత కొన్ని రోజులుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్, న్యూజిలాండ్ క్రికెట్ నుంచి గొప్ప మద్దతు లభిస్తున్నట్టు విలియమ్సన్ పేర్కొన్నాడు. గాయం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, ప్రస్తుతం తన దృష్టంతా సర్జరీ పైనా, ఆ తర్వాత తీసుకోవాల్సిన పునరావాసంపైనే ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. మైదానంలో తిరిగి అడుగుపెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తానని పేర్కొన్నాడు. కాగా, గాయపడి జట్టుకు దూరమైన కేన్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ శ్రీలంక వన్డే కెప్టెన్ దాసున్ షనకు రూ. 50 లక్షల కనీస ధరకు తీసుకుంది.

More Telugu News