Alla Ramakrishna Reddy: నేను పోటీ చేయకపోయినా.. మంగళగిరిలో గెలిచేది వైసీపీనే.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • మంగళగిరికి సంబంధించి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్న ఆర్కే
  • పార్టీకి, తనకు గ్యాప్ ఉందన్న ప్రచారంలో నిజం లేదని వ్యాఖ్య
  • రోజూ వెళ్లి జగన్‌ను కలవాల్సిన పని ఉండదు కదా అని ప్రశ్న
  • కుమారుడి వివాహం సందర్భంగా నిన్నటి సమీక్షకు హాజరుకాలేదని వెల్లడి 
mangalagiri mla alla ramakrishna reddy respond on recent rumours about him

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా మంగళగిరిలో వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. మంగళగిరికి సంబంధించిన ఏ నిర్ణయమైనా జగన్ తీసుకుంటారని.. దానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నిన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష జరిగింది. అయితే ఈ సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరయ్యారు. జగన్ పై కొంతకాలంగా ఆర్కే అసంతృప్తితో ఉన్నారని.. పార్టీకి ఆయనకు గ్యాప్ రావడంతోనే సమావేశానికి దూరంగా ఉన్నారనే వార్తలొచ్చాయి. దీనిపై ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

‘‘కుమారుడి వివాహం సందర్భంగా  నిన్నటి సమీక్షకు హాజరు కాలేకపోయా. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకొచ్చా. అయినా ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయి? నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. మా బాస్ జగన్. ఆయన ఏం చెబితే అదే ఫైనల్’’ అని స్పష్టం చేశారు. 

తన కుమారుడి వివాహానికి ఎవర్నీ పిలవలేదని.. కేవలం రిజిస్టర్ పెళ్లి చేయాలనుకున్నట్లు చెప్పారు. ‘‘పార్టీకి, నాకు గ్యాప్ ఉందన్న ప్రచారంలో నిజం లేదు. రాజకీయాల్లో ఉంటే సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటా.. రాజకీయం వద్దనుకుంటే చక్కగా నా పొలంలో వ్యవసాయం చేసుకుంటా’’ అని స్పష్టం చేశారు. 

రోజూ వెళ్లి జగన్‌ను కలవాల్సిన పని ఉండదు కదా అని ప్రశ్నించారు. తనకు ఆయన ఫ్యామిలీ మెంబర్‌ అన్నారు. 2014 నుంచి 2019 మధ్య ఏం చేయలేదు కాబట్టి నారా లోకేశ్ ను మంగళగిరిలో ప్రజలు ఓడించారన్నారు. మంగళగిరిలో ఆర్కే గ్రాఫ్ ఎలా ఉందనే దానిపై సర్వే చేసుకోవచ్చన్నారు. మంగళగిరి టికెట్ మరొకరికి ఇస్తారనే ప్రచారంపైనా స్పందించారు. ‘‘మంగళగిరిలో నేను పోటీ చేయకపోయినా తర్వాత గెలిచేది కూడా వైసీపీనే’’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News