CSK: సొంతగడ్డపై దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు

  • చెన్నైలో సీఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు
  • తొలి వికెట్ కు 110 పరుగులు జోడించి గైక్వాడ్, కాన్వే
  • సిక్సర్ల మోత మోగించిన చెన్నై ఆటగాళ్లు
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 రన్స్ చేసిన చెన్నై
CSK hammers LSG bowlers on home soil

గత సీజన్ పరాజయాలను మరుగునపడేయాలని కసితో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ పై అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

ఇవాళ సొంతగడ్డపై సీఎస్కే బ్యాటర్లు జూలు విదిల్చారు. రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57), డెవాన్ కాన్వే (29 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27), మొయిన్ అలీ (13 బంతుల్లో 19), అంబటి రాయుడు (14 బంతుల్లో 27 నాటౌట్), కెప్టెన్ ధోనీ (3 బంతుల్లో 12) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బెన్ స్టోక్స్ (8), రవీంద్ర జడేజా (3) నిరాశపరిచారు.

ఆఖర్లో ధోనీ వరుసగా రెండు సిక్సులు కొట్టి తనలో చేవ తగ్గలేదని చాటాడు. చివరి ఓవర్లో ధోనీ బ్యాటింగ్ కు దిగడంతో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. అభిమానులు ధోనీ ధోనీ అంటూ నినాదాలు చేస్తూ, పసుపు జెండాలు ఊపుతూ తమ జోష్ ప్రదర్శించారు. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3, రవి బిష్ణోయ్ 3, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు.

More Telugu News