Virender Sehwag: ధోనీకి తగిన వారసుడెవరో చెప్పిన సెహ్వాగ్

  • గత సీజన్ లో సీఎస్కే సారథ్యం అందుకున్న జడేజా
  • ఘోరంగా విఫలమైన చెన్నై జట్టు
  • తీవ్ర ఒత్తిడి నడుమ కెప్టెన్సీ వదులుకున్న జడేజా
  • ధోనీనే మళ్లీ పగ్గాలు అందుకున్న వైనం
  • సీఎస్కే కెప్టెన్సీ అంశంపై తన అభిప్రాయాలు పంచుకున్న సెహ్వాగ్
Sehwag opines on Dhoni heir for CSK

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించే ఆటగాడెవరన్నది అత్యంత ఆసక్తికరమైన అంశం. గతేడాది ధోనీ ఉండగానే రవీంద్ర జడేజాకు సీఎస్కే కెప్టెన్సీ ఇస్తే ఆ నిర్ణయం అత్యంత దారుణంగా బెడిసికొట్టింది. జడేజా సారథ్యంలో చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలోనే ఘోర పరాభవాలను మూటగట్టుకుంది. దాంతో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, మళ్లీ ధోనీనే పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ లోనూ ధోనీనే జట్టును నడిపిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో, ధోనీకి తగిన వారసుడు ఎవరన్నదానిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. సీఎస్కే కెప్టెన్ గా ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్న ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అని వెల్లడించాడు. ధోనీకి తగిన వారసుడు గైక్వాడ్ అని అభిప్రాయపడ్డాడు. 

గైక్వాడ్ రెండంకెల స్కోరును మూడంకెలుగా మార్చగలిగే సామర్థ్యం ఉన్నవాడని కొనియాడాడు. అతడి ప్రత్యేకత అదేనని సెహ్వాగ్ తెలిపాడు. అలాంటి ఆటగాడికి టీమిండియాలో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు. బహుశా టీమిండియాలో స్థానం కోసం ఇతర ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువగా ఉందనుకుంటా అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

More Telugu News