Deve Gowda: ముందు వాళ్ల ఇల్లు చక్కబెట్టుకోవాలి .. కాంగ్రెస్ కు మాజీ ప్రధాని హితవు

  • ప్రతిపక్ష పార్టీలకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయన్న దేవెగౌడ
  • దేశంలో నాయకత్వ సంపదకు కొదవ లేదని వ్యాఖ్య
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జేడీఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా
Set House In Order First says Ex PM H D Deve Gowda On Congress Pitch For Opposition Unity

కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది. దీనిపై జేడీఎస్ కురువృద్ధుడు, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా తమ ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు దురదృష్టకరమన్నారు. 

ఆదివారం పీటీఐ వార్తా సంస్థతో దేవెగౌడ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని, దేశంలో నాయకత్వ సంపదకు కొదవ లేదన్నారు. కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభజన ఎజెండా కోసం తాము ఓట్లు అడగడం లేదని.. ‘సమష్టి సామాజిక, అభివృద్ధి దృక్పథం, పంచరత్న కార్యక్రమం’ పేరుతో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

తమ పార్టీ పాత మైసూరు రీజియన్ కే పరమితమైందని జాతీయ పార్టీలు తెలివిగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ‘కష్టపడి పని చేయండి.. ప్రజలతో చిత్తశుద్ధితో ఉండండి.. వారిని దూషించకండి.. వారిని విభజించవద్దు..’’ ఇదే తమ పార్టీ వ్యూహమని దేవెగౌడ చెప్పారు. 

జనతా పరివార్ లేదా థర్డ్ ఫ్రంట్ ను పునరుద్ధరించడం సాధ్యమేనని మాజీ ప్రధాని చెప్పారు. ‘‘ప్రతిదీ సాధ్యమే. మూడో లేదా నాలుగో ఫ్రంట్‌ను నేను నమ్మను. మనం ఏం చేసినా.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే మొదటి ఫ్రంట్ మనమే అవ్వాలని అనుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News