TSPSC: పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ

Enforcement Directorate Enters in to probe TSPSC question paper leak case
  • డబ్బు లావాదేవీలకు సంబంధించి విచారణ
  • కేసు నమోదుకు ఏర్పాట్లు చేసిన అధికారులు
  • డేటా లీకేజీ పై ప్రత్యేకంగా మరో కేసు నమోదు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో జరిగిన డబ్బు లావాదేవీల గుట్టు తేల్చేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగనుంది. పేపర్ కొనుగోలు కోసం రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాఫ్తులో ఇప్పటికే వెల్లడైంది. దీంతో డబ్బు ఎవరెవరి చేతులు మారింది, వారికి ఎక్కడి నుంచి సమకూరిందనే వివరాలపై అధికారులు విచారించనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలకు సంబంధించి కేసు నమోదు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ కావడంపై తొలుత బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆపై ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఇప్పటికే 15 మంది నిందితులను అరెస్టు చేశారు. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ కావడంతో ఇటీవల జరిగిన ఆ పరీక్షలో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను విచారిస్తున్నారు. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేయనుంది. డేటా లీకేజీ పైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది.

ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో 6 పరీక్షలకు సంబంధించి 15 ప్రశ్నపత్రాలను సిట్‌ అధికారులు గుర్తించారు. పేపర్ లీకేజీ ద్వారా ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి లక్షలు వెనకేసుకున్నారు. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏడు పరీక్షలలో ఐదు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని దర్యాప్తులో నిర్ధారణ జరిగింది. ప్రవీణ్ తన స్నేహితురాలు రేణుకకు రూ. 10 లక్షలకు అమ్మగా.. భర్తతో కలిసి రేణుక ఆ పేపర్లను మరో ఐదుగురికి అమ్మి రూ.25 లక్షలు వసూలు చేసింది. ఈ కేసులో డబ్బు లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ దర్యాఫ్తు చేపట్టనుందని సమాచారం.
TSPSC
paper leakage
ED
praveen kumar
Renuka devi
case

More Telugu News