vitamin Supplements: 50 ఏళ్లు దాటితే ఈ సప్లిమెంట్లు అవసరం

  • వృద్ధాప్యంలో ఎక్కువ మందిలో బీ12 లోపం
  • శాకాహారుల్లోనే ఈ సమస్య ఎక్కువ
  • విటమిన్ డీ లోపిస్తే బోలుగా మారే ఎముకలు
  • క్యాల్షియం కూడా చాలా అవసరం
  • వైద్యుల సిఫారసు మేరకు సప్లిమెంట్లు తీసుకోవచ్చు
Supplements That Are Actually Worth It for People Over 50 According to Doctors

వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో శరీర జీవ క్రియల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వయసులో ఉన్నప్పుడు మన శరీరానికి కావాల్సిన వివిధ పోషకాలను ఆహారం నుంచి తీసుకునే మెకానిజం మన శరీరంలో సజావుగా నడుస్తుంది. 50 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఇందులో మార్పులు చోటు చేసుకుంటాయి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత మరింత పెరుగుతుంది. తమకంటూ కావాల్సినంత సమయం కేటాయించుకోగల తీరిక ఈ వయసులో ఉంటుంది. కానీ, ఆరోగ్యం కూడా తోడైతేనే వృద్ధాప్యాన్ని ఆనందించగలరు. లేదంటే ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక 50 ఏళ్లకు వచ్చిన వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన సప్లిమెంట్లు కొన్ని ఉన్నాయి.

విటమన్ బీ12
50 ఏళ్లు నిండిన తర్వాత ఎక్కవ మందిలో బీ12 లోపం కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువ. మెదడు ఆరోగ్యానికి బీ12 చాలా అవసరం. కండరాలకు కూడా ఇది కావాలి. మెదడులో సెల్స్ మధ్య సరైన సమాచారానికి, కణాలు సాఫీగా పనిచేయడానికి బీ12 కావాలి. శాకాహారులకు బీ12లోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా మాంసాహారం నుంచి లభిస్తుంది. మాంసం, చేపలు, గుడ్లు తినే వారికి బీ12 తగినంత అందుతుంది. శాకాహారులకు పాల పదార్థాల రూపంలో కొంత అందుతుంది. వైద్యులను సంప్రదించి, బీ12 పరీక్ష చేయించుకుని, వారి సిఫారసు మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలి.

క్యాల్షియం
ఎముకలు బలంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలం. ముఖ్యంగా వృద్ధాప్యంలో కింద పడే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎముకలు డొల్లగా ఉంటే చిన్న ప్రమాదానికే పెద్ద ఫ్రాక్చర్ ఎదుర్కోవాల్సి రావచ్చు. క్యాల్షియం కార్బోనేట్ కు బదులు, క్యాల్షియం సిట్రేట్ సప్లిమెంట్ ను తీసుకోవచ్చు. క్యాల్షియం కార్బోనేట్ తో కిడ్నీలో రాళ్లు పెరుగుతాయి. ఇక సహజంగా క్యాల్షియాన్ని భర్తీ చేసుకోవాలంటే పాలు, పాల పదార్థాలు, రాగి పరిష్కారాలు. వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్ తీసుకోవచ్చు.

విటమిన్ డీ
చాలా మందిలో విటమిన్ డీ లోపం కూడా కనిపిస్తోంది. వ్యాధి నిరోధక శక్తిలో, ఎముకల పటిష్ఠతకు 'డీ' అవసరమే. డీ తగినంత ఉన్నప్పుడే ఎముకలకు క్యాల్షియం పడుతుంది. డీ విటమిన్ లోపించినా ఫ్రాక్చర్ల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు, విటమిన్ డీ లోపంతో కొన్ని రకాల కేన్సర్ల ముప్పు పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. విటమన్ డీ అల్జీమర్స్ వ్యాధి రిస్క్ ను కూడా తగ్గిస్తుంది. రోజూ సూర్యోదయం సమయంలో అరగంట వంటిపై ఎండ పడేలా చూసుకుంటే విటమిన్ డీ తగినంత లభిస్తుంది. లేదంటే సప్లిమెంట్లు తీసుకోవాల్సి వస్తుంది.

గ్లూకోసమైన్
మోకాలు మధ్య కార్టిలేజ్ అరిగిపోకుండా ఉండేందుకు, లేదంటే అరుగుదల ఆరంభంలో గ్లూకోసమైన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. కార్టిలేజ్ చాలా వరకు అరిగిన తర్వాత దీన్ని తీసుకున్నా పెద్ద ఫలితం కనిపించదు. గ్లూకోసమైన్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. 

మెలటోనిన్
పాశ్చాత్య దేశాల్లో వృద్ధాప్యంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్న వారికి మెలటోనిన్ సప్లిమెంట్ సిఫారసు చేస్తున్నారు. మెలటోనిన్ మన శరీరంలోనే సహజంగా తయారవుతుంది. కాకపోతే వృద్ధాప్యంలో ఇది తగ్గిపోతుంది.

More Telugu News