Rhino: కోపిష్ఠి ఖడ్గమృగం.. పర్యాటకుల జీపును కిలోమీటరు వెంబడించి బెంబేలెత్తించిన వైనం.. వీడియో ఇదిగో!

Angry Rhino Charges At Tourist Jeep In South Africa and Chases It For Over 1 Km
  • దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషన్ పార్క్‌లో ఘటన
  • వీడియోపై వెల్లువెత్తుతున్న కామెంట్లు
  • జీపు డ్రైవర్ దయవల్ల సురక్షితంగా బయటపడ్డామన్న చాప్‌మన్
చూస్తుంటే ఇది కోపిష్ఠి ఖడ్గమృగంలా ఉంది. సఫారీకి వచ్చిన పర్యాటకులను ఏకంగా కిలోమీటరు దూరం పాటు వెంబడించి వారికి ముచ్చెమటలు పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని గ్రేటర్ క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగిందీ ఘటన. అనాస్టేసియా చాప్‌మన్ తన స్నేహితులతో కలిసి సఫారీ జీప్‌లో విహరిస్తుండగా ఈ ఘటన జరిగింది. 

రోడ్డు పక్కన గడ్డి మేస్తున్న ఖడ్గమృగం జీపు శబ్దానికి అటువైపు చూసి కోపంతో ఒక్కసారిగా జీపును వెంబడించింది. కోపంతో ఊగిపోతూ వేగం మరింత పెంచింది. దీంతో జీపులోని చాప్‌మన్ ఆమె స్నేహితులు భయంతో వణికిపోయారు. దానికి చిక్కితే ఏమవుతుందోనని భయపడిపోయారు. దారి బురదగా ఉన్నప్పటికీ వెనక ఖడ్గమృగం వెంబడిస్తుండడంతో జీపు డ్రైవర్ మరింత వేగం పెంచాడు.  

ఇది చాలా భయంకరమైన అనుభవమని చాప్‌మన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. మూడు నాలుగు నిమిషాలపాటు కిలోమీటరు దూరం తమను అది భయంకరంగా వెంబడించిందని పేర్కొన్నారు. అయితే, తమ డ్రైవర్ వీలైనంత వేగంగా వాహనాన్ని డ్రైవ్ చేయడంతో తాము సురక్షితంగా బయటపడగలిగామని అన్నారు. వైరల్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు. 

‘‘ఖడ్గమృగాలు చాలా నెమ్మదిగా కదులుతాయని, వాటి బరువు కారణంగా సులభంగా అలసిపోతాయని అనుకునేవాడని. కానీ ఈ వీడియో చూశాక నా నమ్మకం కరెక్ట్ కాదని అనిపించింది. సింహాల కంటే ఖడ్గమృగాల వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారన్న గణాంకాలు చదివినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది’’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Rhino
South Africa Safari
Kruger National Park
Viral Videos

More Telugu News