Tammineni Sitaram: ఏపీ స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు

  • తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారన్న కూన రవికుమార్
  • తాను డిగ్రీ చదవలేదని ఓ ఇంటర్వ్యూలో తమ్మినేని స్వయంగా చెప్పారన్న టీడీపీ నేత
  • ఎన్నికల అఫిడవిట్‌లోనూ అదే విషయాన్ని పేర్కొన్నారని గుర్తు చేసిన కూన
  • ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • రాష్ట్రపతితోపాటు ఏపీ, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు సీజే, సీఎం జగన్‌కు లేఖలు
TDP Leader Kuna Ravikumar Writes Letters On AP Speaker Tammineni Fake Degree Certificate to President Murmu

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ఏపీ, తెలంగాణ గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి జగన్‌కు నిన్న లేఖలు రాశారు. 

తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. లా కోర్సులో చేరాలంటే డిగ్రీ, లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీ కానీ, అలాంటి మరే కోర్సు కానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ‘ఐ డ్రీమ్’ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారని గుర్తు చేశారు.

అంతేకాదు, 2019 సాధారణ ఎన్నికల  సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లోనూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారని అన్నారు. తన అత్యున్నత విద్యార్హత ఇంటర్మీడియెట్ మాత్రమేనని, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ మధ్యలోనే మానేశానని ఆయన స్వయంగా వెల్లడించిన విషయాన్ని కూన రవికుమార్ ఆ లేఖలో గుర్తు చేశారు. 

అలాగే, తమ్మినేని లా పరీక్షలకు హాజరైనట్టు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ను, ఎన్నికల అఫిడవిట్‌ను కూడా ఆయన ఆ లేఖలకు జత చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకోవడం సరికాదని, విలువలకు, నైతిక ప్రవర్తనకు కట్టుబడలేదని, కాబట్టి ఆయన శిక్షార్హుడని, తమ్మినేనిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టంముందు అందరూ సమానమేనని చాటిచెప్పాలని ఆయన ఆ లేఖలో కోరారు.

More Telugu News