Telugudesam: టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు జోష్.. 28వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలకు ప్రణాళిక

TDP future plan
  • 28న హైదరాబాద్ లో పొలిట్ బ్యూరో సమావేశం
  • సభకు హాజరుకానున్న ఇరు రాష్ట్రాల నేతలు
  • అధినేత నుంచి గ్రామ స్థాయి నేత వరకు అందరూ క్షేత్ర స్థాయిలో ఉండేలా కార్యక్రమాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను, ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయాలతో టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే రీతిలో ఇకపై కూడా విజయపరంపరను కొనసాగించే క్రమంలో ఈ నెల 28 నుంచి వరుస కార్యక్రమాలకు ప్రణాళికను రూపొందించింది. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాల మిళితంగా కార్యాచరణను రూపొందించింది. ఈ నెల 28న హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతోంది. 

మే నెలలో నిర్వహించే మహానాడు సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాద్ లో పార్టీ ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు రెండు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు హాజరుకానున్నారు. 

ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాలలో పార్టీ జోన్-1, జోన్ -4, జోన్ -5 సమావేశాలు జరుగుతాయి. జోన్ సమావేశాల అనంతరం అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు... ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణ, ప్రజా సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తు చేస్తున్నారు. అధినేత నుంచి గ్రామ స్థాయి నేత వరకు అంతా క్షేత్ర స్థాయిలో ఉండేలా కార్యక్రమాలను రూపొందించారు.
Telugudesam
Future Plan

More Telugu News