Malla Reddy: పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా అడిగారు.. నేను చేయనన్నా.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

telangana minister malla reddy sensational comments on pawan kalyan and harish shankar movie
  • ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి
  • విలన్ గా నటించమని హరీశ్ శంకర్ తనను గంటన్నర బతిమిలాడారని వెల్లడి
  • ఎన్నికలయ్యాక తెలంగాణ యాసలో చిత్రాలు నిర్మిస్తానని ప్రకటన
  • తాను చాలా ఫేమస్ అయ్యానని, తాను తుమ్మినా తుఫాన్ వస్తుందన్న మంత్రి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి రూటే వేరు. తన మాటలతో ఆయ‌న ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. ఆయ‌నకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా మ‌రోసారి ఆయన వార్త‌ల్లో నిలిచారు. తనని పవన్ కల్యాణ్‌ చిత్రంలో విలన్ గా నటించమని దర్శకుడు హరీష్ శంకర్ అడిగినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓ రోజు హరీష్ శంకర్ నా దగ్గరకి వచ్చి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యిపోయావు అన్నా. పవన్ కళ్యాణ్ తో నేను తీసే సినిమాలో విలన్ గా నటిస్తావా అని అడిగారు. గంటన్నరసేపు బతిమిలాడారు. కానీ నేను విలన్‌గా నటించనని చెప్పాను’’ అని వెల్లడించారు.

23 ఏళ్ల వయసులో తనకు పెళ్లి అయిందని, అప్పుడు తన దగ్గర ఏమీ లేదని, పాలు అమ్మానని మల్లారెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చానని, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని వెల్లడించారు.

‘మేమ్‌ ఫేమస్‌’ చిత్ర టీజర్ ఎంతో నచ్చిందని, తప్పకుండా చిత్రం సక్సెస్ అవుతుందని మల్లారెడ్డి అన్నారు. ప్రభాస్‌ మేకప్‌ వేసుకుంటాడని, ఈ చిత్ర హీరో సుమంత్‌ మేకప్‌ వేసుకోకుండానే స్మార్ట్‌గా ఉంటాడని ఆకాశానికి ఎత్తేశారు. సుమంత్‌ తెలంగాణ మోడల్‌ అని, రాబోయే రోజుల్లో దుమ్ము రేపుతాడని తెలిపాడు. ఈ హీరోతో తానొక సినిమా చేస్తానని, ఎన్నికలు అయ్యాక తెలంగాణ యాసలో పలు చిత్రాలు నిర్మిస్తానని తెలిపారు.

ఫేమస్‌ అవ్వాలంటే కష్ట పడాలని, యూత్‌ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లక్ష్యాన్ని పెట్టుకుని.. ఆ దిశగా ప్రయాణించాలని చెప్పుకొచ్చారు. తను చాలా ఫేమస్‌ అయ్యానని, తను ఇప్పుడు తుమ్మినా తుఫాన్‌ వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తాను చాలా కష్టపడ్డానని, శ్రమ ఉందని వెల్లడించారు. తానేం గొప్ప వ్యక్తిని కాదని, సింపుల్‌ లివింగ్‌, లో ప్రొఫైల్‌, హై థింకింగ్‌ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.
Malla Reddy
Pawan Kalyan
harish shankar
villain character
mem famous

More Telugu News