ayurveda medicine: సంతాన భాగ్యానికి ఆయుర్వేద పరిష్కారాలు

  • అశ్వగంధ, శతావరి, సఫేద్ ముస్లితో టెస్టో స్టెరాన్ వృద్ధి
  • ఫలితంగా లైంగిక కోర్కెలు, సామర్థ్యం పెరుగుదల
  • మహిళలకు ఉసిరి.. పురుషులకు గోక్షూరతో మంచి ఫలితాలు
  • ఆయుర్వేద వైద్యుల సూచనతో వీటిని వాడుకోవచ్చు
ayurveda herbs that improve fertility vigor

పెళ్లయిన దంపతులు అందరూ సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. త్వరగా తమ వారసులను చూడాలని కోరుకునే వారే ఎక్కువ. కానీ, నేడు సంతాన సాఫల్యత ఆలస్యమై మానసిక వేదన అనుభవిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. సంతాన భాగ్యానికి ఆయుర్వేదంలో ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచడమే కాదు, సాఫల్యత అవకాశాలను ఆయుర్వేద మూలికలు పెంచగలవని నిరూపితమైంది. ఆయుర్వేదం పరంగా ఫలదీకరణ అవకాశాలను పెంచే ఔషధాలను గమనిస్తే..

అశ్వగంధ
శక్తిని, దేహ సామర్థ్యాలను పెంచే మూలిక ఇది. అశ్వగంధ తీసుకుంటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. వీర్యం నాణ్యతను సైతం పెంచుతుంది. వీర్యకణాల చలన శీలతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యం నాణ్యతతోపాటు, మొత్తం వీర్య కణాల్లో చురుకైనవి ఎక్కువగా ఉన్నప్పుడు ఫలదీకరణ అవకాశాలు పెరుగుతాయి.

శిలాజిత్
టెస్టో స్టెరాన్ స్థాయులను శిలాజిత్ కూడా వృద్ధి చేస్తుంది. లైంగిక సామర్థ్యం పెరిగేందుకు టెస్టోస్టెరాన్ సాయపడుతుంది. దీంతో ఫలదీకరణ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అథ్లెట్లు సైతం శిలాజిత్ వాడుతుంటారు. అలసటను తగ్గించడంతోపాటు, ఓపికను పెంచుతుంది. 

సఫేద్ ముస్లి
ఫలదీకరణ, లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఆయుర్వేదంలో వందల ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఔషధం ఇది. టెస్టో స్టెరాన్ స్థాయిని పెంచుతుంది. దీనికితోడు  లైంగిక సామర్థ్యం, సంతాన ఫలదీకరణ అవకాశాలపై ప్రభావం చూపించే ఆందోళన, ఒత్తిడిని తగ్గించగలదు.

ఉసిరి/ఆమ్ల
పురుషులు, స్త్రీలకు మంచిది. ముఖ్యంగా మహిళలకు రుతు సమయంలో సహజ డీటాక్సిఫికేషన్ (హానికారకాల నిర్వీకరణ) ప్రక్రియకు బలాన్నిస్తుంది. హార్మోన్ల సమతుల్యతకు సాయపడుతుంది. దీంతో మహిళల వైపు ఫలదీకరణ అవకాశాలు మెరుగుపడతాయి.

గోక్షూర
గోక్షూర ఎంతో ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద ఔషధం. పురుషుల్లో లైంగిక కోర్కెలను ఇది ప్రేరేపిస్తుంది. టెస్టో స్టెరాన్ హార్మోన్ ను పెంచుతుంది. దీనివల్ల కండరాలలో చురుకుదనం వస్తుంది. అంతేకాదు ఇది సహజ డైర్యూటిక్. అంటే వృద్ధాప్యంలో మూత్ర పరమైన పనితీరును మెరుగుపరుస్తుంది. 

విదారి కండ్
సాధారణ ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాదు, లైంగిక కోర్కెలను ఇది పెంచుతుంది. కండరాల వృద్ధికి సాయపడుతుంది. ఫలితంగా శృంగార సామర్థ్యం బలపడుతుంది. 

శతావరి
ఇందులో సహజసిద్ధమైన పైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. మహిళల్లో లైంగిక కోర్కెలను పెంచుతుంది. రుతుక్రమం సక్రమంగా ఉండేలా చూస్తుంది. తల్లి పాలు పెరిగేందుకు కూడా దీన్ని సూచిస్తుంటారు.

గమనిక: ఆయుర్వేద ఔషధాలు శరీర తత్వానికి అనుగుణంగా వాడుకోవాల్సి ఉంటుంది. కనుక ఒక్కసారి వైద్య నిపుణులను సంప్రదించి ఆరంభించడం మంచిది. 

More Telugu News