Chandrababu: మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలు... నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ... టీడీపీ ఇక అన్ స్టాపబుల్: చంద్రబాబు

  • టీడీపీ జోన్-3 సమావేశానికి హాజరైన చంద్రబాబు
  • మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో సమావేశం
  • టీడీపీ గట్టిగా నిశ్చయించుకుంటే వేరేవాళ్లు తట్టుకోలేరన్న చంద్రబాబు
  • వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ పై విశ్వాసం పోయిందని వ్యాఖ్య 
  • అనురాధ గెలుపు కుక్క కాటుకు చెప్పుదెబ్బలా నిలిచిందన్న బాబు 
Chandrababu says TDP unstoppable now on wards

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన టీడీపీ జోన్ -3 సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగుదేశానికి బలమైన సైన్యం ఉంది అని వెల్లడించారు. ఒక్కసారి గెలవాలని మీ మనసులో పడితే, గెలుపు తెలుగుదేశం పార్టీది తప్ప మరొకరిది కాదు అని స్పష్టం చేశారు. టీడీపీ గట్టిగా నిశ్చయించుకుంటే వేరేవాళ్లు తట్టుకోలేరన్నది చరిత్ర చెప్పిన సత్యం అని పేర్కొన్నారు. 

"40 ఏళ్లుగా భుజాలు అరిగిపోయేలా తెలుగుదేశం సైన్యం పార్టీజెండాలు మోస్తోంది... కుటుంబాలు, ఆస్తులు కోల్పోయినా పార్టీ కోసమే పనిచేశారు... చేస్తున్నారు. అలాంటి వారికి శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను" అని వివరించారు. 

"అవినీతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసాల వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది. అప్పులు చేయడం, అవినీతి, అరాచకాల్లో మాత్రమే ముందున్నారు. సంవత్సరం క్రితం బాదుడే బాదుడు కార్యక్రమం ప్రారంభించాం. దాని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడుని కార్యకర్తలు, నేతలు భారీగా విజయవంతం చేశారు. తరువాత ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాం. పన్నులు, ఛార్జీలు, ధరల భారంతో ప్రజల్ని దోచుకుంటున్నారు. మున్సిపల్, ఆస్తిపన్ను. చెత్త పన్ను అంటూ పన్నులమీద పన్నులు వేస్తున్నారు. వాటిన్నింటిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్ని చైతన్యవంతం చేశారు. దాని ఫలితమే 108 నియోజకవర్గాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచింది. 

మన గెలుపు వైసీపీకి, జగన్ కు షాక్ ఇచ్చింది. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో దెబ్బ కొట్టాం. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా జగన్ పై విశ్వాసం లేదు. అందుకే టీడీపీకి ఓటేశారు. 23 మంది టీడీపీ తరుపున గెలిస్తే, అవహేళన చేశారు. దేవుడి స్క్రిప్ట్ అని అందుకే 23 మందే మిగిలారని ఎద్దేవా చేశారు. నిన్న భగవంతుడు తిరిగి గొప్ప స్క్రిప్ట్ రాశాడు. 23 ఓట్లు, 23వ తేదీ, 2023న భగవంతుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. ఇకపై టీడీపీ అన్ స్టాపబుల్. గేరుమార్చి స్పీడు పెంచుతున్నాం. సైకిల్ దూసుకెళ్తుంది.. అడ్డమొచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆడబిడ్డలు, తెలుగుతమ్ముళ్లు అందరూ పోరాటానికి సిద్ధమే" అంటూ చంద్రబాబు సమరశంఖం పూరించారు. 

"జగన్, అతని పార్టీ గాలికి కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశయాలు, పద్ధతిలేని పార్టీ, స్వార్థంతో పుట్టిన పార్టీ స్వార్థంతోనే పోతుంది. మనం గెలుపుకోసం పటిష్టమైన వ్యవస్థతో ముందుకెళ్తున్నాం. 25 వేల ఓట్లకు ఒక క్లస్టర్, 5 వేల ఓట్లకు ఒక యూనిట్, బూత్ కు  ఒక బూత్ కమిటీ, 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారథి ఉంటారు. సారథుల్లో పురుషులు, మహిళలు ఉండాలి. వారిద్దరూ కలిసి అన్ని కుటుంబాలను ఏకతాటిపైకి తీసుకురావాలి. 

పార్టీ కోసం మీరు కష్టపడుతున్నారు. సమాజం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అలాంటి వారి కోసం పకడ్బందీ వ్యవస్థ రూపొందిస్తున్నాం. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, వారిని వెతుక్కుంటూ పార్టీనే వారి వద్దకు వెళ్తుంది. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభను హైదరాబాద్ లో జరుపుకోబోతున్నాం. 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం. 28వ తేదీన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నాం. మే 28న మన నాయకుడి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నాం. ఒక యుగపరుషుడు పుట్టిన గడ్డ ఇది. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ని గుర్తుంచుకుంటుంది. 

5 కోట్ల ప్రజల నినాదం ‘సైకోపోవాలి.. సైకిల్ రావాలి’. పంచుమర్తి అనురాధ వీరవనిత, ఆమెను వైసీపీ చిల్లర బ్యాచ్ దారుణంగా ట్రోల్ చేశారు. అనురాధ గెలుపు కుక్కకాటుకి చెప్పదెబ్బలా నిలిచింది” అని చంద్రబాబు అన్నారు.

More Telugu News